తలాక్‌కు తలాక్...

వివాహం..ప్రతి మనిషి జీవితంలో గొప్ప మలుపు. ఇద్దరు మనుషులను..రెండు కుటుంబాలను కలిపే ఈ కార్యానికి భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇదొక పవిత్రకార్యంగా భావిస్తారు. భగవంతుడు మానవజాతికి మాత్రమే ప్రసాదించిన అనేక ప్రత్యేకతలలో వివాహం ఒకటి. జాతి, కులం, మతం అనే తేడా లేకుండా ఈ కార్యాన్ని ఎవరి స్థోమతని బట్టి వారు వైభవంగా జరుపుకుంటారు. చిన్న, పెద్ద, పేద, గొప్ప అన్న తారతమ్యాలను మరచి వివాహ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు...కానీ అభిప్రాయాలు కలవకపోవడమో..ఆలోచనలు సరిపడకపోవడమో..సర్దుకుపోవడం కుదురకపోవడమో..కారణాలు ఏమైనా కొన్ని జంటలు విడిగా ఉండాలనుకుంటున్నాయి.

 

హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలంటే పరస్పర అంగీకారం ఉండాలి. అలా అయితేనే న్యాయస్థానాలు వారి విజ్ఞప్తిని మన్నించి విడాకులు మంజూరు చేస్తాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ముస్లిం విడాకుల పద్ధతి. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం మూడుసార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. భర్త సరదాగా అన్నా కూడా ఆ వివాహం చెల్లదు. ఖతార్‌కు చెందిన ఒక వ్యక్తి సరదాగా ఇంటర్నెట్‌లో తన భార్యకి తలాక్ అని మూడు సార్లు చెప్పాడు. అంతే వివాహం రద్దు చేయబడింది. షరియా చట్ట ప్రకారం ఇస్లామిక్ మత సంస్థ దార్-ఉల్-ఉలూమ్ వివాహం చెల్లదని తీర్పు ఇచ్చింది.  షయారో బానో అనే భారతీయ ముస్లిం మహిళకు ముప్పై ఏళ్లు. సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన షయారాతో 15 ఏళ్లు కాపురం చేశాక ఆమె భర్త విడాకులిచ్చేశాడు. గత పదేళ్లుగా షయారో బానోను భర్త నానా రకాలుగా హింసిండం, కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. ఆమెకు బలవంతంగా గర్బస్రావాలు చేయించాడు. శారీరకంగా, మానసికంగా ఎంతో  హింసించేవాడు, బయటకు కూడా వెళ్లనిచ్చేవాడు కాదు. షయారా ఆ బాధలను తట్టుకోలేకపోయింది.

 

ఒక రోజు ఆమె భర్తే అలహాబాద్‌లోని తమ ఇంటి నుంచి బానోను ఉత్తరాఖండ్‌లోని పుట్టింటికి పంపించేశాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె భర్త కాగితం మీద తలాక్..తలాక్..తలాక్ అని మూడుసార్లు రాసి షయారా బానోకు విడాకులు ఇచ్చేశాడు. ఈ చర్య ఆమెకు ఆగ్రహాన్ని కలిగించింది. భర్త విడాకులు ఇచ్చినందుకు ఏమాత్రం బాధపడని షయారా, సింపుల్‌గా తలాక్‌ చెప్పేసి భార్య నుంచి విడిపోవాలనుకునే భర్త చర్యలోని న్యాయబద్ధతను ప్రశ్నించాలనుకుంది. త్రిపుల్ తలాక్, బహుభార్యత్వం, నిఖా హలాలాలు చట్టవిరుద్ధమని వాటిని నిషేధించాలనే ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. మొట్టమొదటిసారి ఒక ముస్లిం మహిళ తన హక్కుల కోసం ప్రశ్నించడం పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆమె పోరాటం ఇలాంటి చర్యకే గురైన వేలాది ముస్లిం మహిళల్లో స్పూర్తిని నింపింది. దీంతో తలాక్ సిస్ట్‌మ్‌ను భారతదేశం నుంచి తొలగించాలంటూ భారతీయ ముస్లిం మహిళల సంఘం పోరాటం ప్రారంభించింది.

 

దేశవ్యాప్తంగా తాము వేయబోయే పిటిషన్‌కు మద్థతివ్వాలని కోరుతున్న సంఘం..జాతీయ మహిళా కమిషన్ కూడా తమకు సహకరించాలని కోరింది. నిజానికి కేవలం నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులిచ్చే పద్థతిని పాకిస్థాన్‌తో సహా 22 ఇస్లామిక్ దేశాలు నిషేధించినా భారతదేశం మాత్రం ఇంకా కొనసాగిస్తోంది. ఇస్లాంకు ముందునాటి అరబ్ సమాజంలో విడాకులకు అనాగరిక పద్ధతి అవలంభించేవారు. ఆ రోజుల్లో అరబ్ పురుషులు చీటికిమాటికి తలాక్ చెబుతూ తర్వాత తలాక్‌ను వెనక్కి తీసుకుంటూ భార్యలను అష్టకష్టాలు పెట్టేవారు. ఖురాన్ దీన్ని నిషేధిస్తూ తలాక్‌ను రెండుసార్లు మాత్రమే చెప్పవచ్చునని నిర్దేశించింది. భార్యాభర్తల మధ్య ఇక రాజీ కుదరదని భావిస్తేనే మూడోసారి తలాక్ చెప్పాలని ఖురాన్ తెలిపింది. ఏడో శతాబ్దికి పూర్వంనాటి ఈ దురాచారాన్ని ముస్లిములు ఇప్పటికీ ఎందుకు అనుసరించాలి.?

 

ఇస్లామ్‌లో ఖుల్లా అనే ఆచారం కింద ముస్లిం మహిళలు కూడా భర్తకు విడాకులిచ్చే వీలున్నా, దానికి భర్త నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అదే ముస్లిం పురుషుడు మాత్రం తలాక్ చెప్పడానికి భార్య అనుమతి పొందనక్కర్లేదు. స్త్రీల పట్ల వివక్ష ఎలా ఉందో చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. ఇంతకాలం ఓపిక పట్టిన ముస్లిం మహిళా లోకం ఆందోళనబాట పట్టింది. ముస్లిం స్త్రీలకు ఖురాన్ ద్వారా, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులను తప్పకుండా అమలు జరపాలని బీఎంఎంఏ ఆన్‌లైన్ పిటిషన్ వేసింది. పాకిస్థాన్ సహా అన్ని ఇస్లామ్ దేశాలు మారుతున్న కాలానికి అనుగుణంగా వారి ఖురాన్ సూత్రాలను సంస్కరించాయి. కానీ భారత్‌లోని ముస్లిం పర్సనల్ లా బోర్డు తన లాను క్రోడీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షరియా బానో వేసిన పిటిషన్‌పై అందరి కళ్లు పడ్డాయి. సుప్రీం ఏం తీర్పు చెప్పబోతుందోనని ముస్లిం లోకం ఎదురు చూస్తోంది.