నెత్తుటి దారులు..

రోడ్డు ప్రమాదం..ఆనందంగా సాగిపోతున్న ఒక కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపుతుంది. భర్తకు భార్యను, భార్యకు భర్తను, పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతుంది. హత్యలు, ప్రాణాంతక వ్యాధులు, విపత్తులు, ఆఖరికి యుద్ధాలలో మరణించేవారి కన్నా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్యే ఎక్కువ. ఈ విషయం మేం చెబుతుంది కాదు. సాక్షాత్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ విడుదల చేసిన నివేదిక . 2015 సంవత్సరానికి సంబంధించి రోడ్డు ప్రమాదాల నివేదికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. ఈ నివేదిక నిగ్గుతేల్చే నిజాలను కళ్లకు కట్టింది. అంతకు ముందు ఏడాది కంటే ప్రమాదాలు 2.5%, మృతుల సంఖ్య 4.6% పెరిగాయి. దేశంలో గంటకు 57 ప్రమాదాలు జరుగుతున్నాయి. 17 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 

 

*  2014లో 4,89,400 ప్రమాదాలు జరిగితే 2015 నాటికి 5,01,423 లక్షలకు చేరాయి.
*  2014లో 1,39,671 మంది చనిపోతే 2015లో 1,46,133 మంది దుర్మరణం చెందారు.
*  2014లో 4,93,474 మంది గాయపడగా 2015లో 5,00,279 మంది గాయపడ్డారు.
*  2014లో ప్రతి 100 ప్రమాదాల్లో సగటున 28.5 మంది చనిపోగా 2015

    నాటికి 29.1కి పెరిగింది.
*  దేశంలో రోజూ సగటున 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా ,

    వాటిలో సగటున 400 మంది చనిపోతున్నారు.
*  2015లో 57,083 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి.

    20,709 మంది చనిపోయారు
*  ఓవర్‌లోడ్ కారణంగా 77,116 ప్రమాదాలు జరిగాయి. 28,199 మంది చనిపోయారు.
*  28.4% ప్రమాదాలు జాతీయ రహదారుల్లో, 24% రాష్ట్ర రహదారుల్లో జరిగాయి. 
 

ఎక్కువ శాతం ప్రమాదాలన్ని ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాద శాతంలో ద్విచక్ర వాహనాల శాతం 28.8%గా నమోదైంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం మూడు నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ప్రమాదాలకు డ్రైవర్ల పొరపాట్లే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతివేగంతో 62.2% ప్రమాదాలు జరిగాయి. మద్యం, డ్రగ్స్ సేవించి వాహనం నడిపిన కారణంగా 4.2% ప్రమాదాలు, 6.4% మరణాలు సంభవించాయి. ప్రమాదాల్లో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

 

ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే..ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా , విజయవాడ-హైదరాబాద్ , చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారులపై రోజూ ఏదో ఒక సమయంలో ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. దేశంలోనే అత్యంత రద్దీ అయిన రహదారిగా పేరొందిన విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరిగి, ఎంతో మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. నిన్న విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌టెన్‌లో నిలిచాయి. 24,258 ప్రమాదాలతో  ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఏడవ స్థానంలో నిలవగా, 21,252 ప్రమాదాలతో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. నగరాల్లో జరిగిన ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 2,761 ప్రమాదాలు జరగ్గా అందులో 425 మంది మరణించారు. 4,685 మంది గాయపడ్డారు. ఇక 1,644 ప్రమాదాలతో విజయవాడ 16వ స్థానంలో, 1,637 ప్రమాదాలతో విశాఖ 17వ స్థానంలో నిలిచింది.

 

మానవ నిర్లక్షం కూడా ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. సీటు బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పాటు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని ప్రభుత్వాలు నెత్తినోరు బాదుకుంటున్నారు. అయినా ప్రజల వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వాలు కూడా చేతులేస్తున్నాయి. మొన్నామధ్య తెలంగాణ ప్రభుత్వం హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసినా జనం తప్పించుకుని తిరిగారు. ఇక చేసేది లేక సర్కార్ చూసీ చూడనట్లుగా వదిలేసింది. ప్రమాదవశాత్తూ జరిగిన వాటిని మనం తప్పించలేం. కాని తెలిసి తెలిసి ప్రమాదానికి కారణమవ్వడం మాత్రం క్షమించరాని నేరం. ఆ నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతుంది. కాబట్టి ప్రమాదాల నివారణలో ప్రభుత్వాలకు సహకరిద్దాం.