శిధిలం నుంచి శిఖరం దిశగా..నవ్యాంధ్రప్రదేశ్

సుసంపన్నంగా అలరారుతున్న తెలుగుజాతిని రెండు ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆదాయాన్ని, ఆస్తులను తెలంగాణకి, అప్పులను ఆంధ్రకు పంచారు. అలాంటి సమయంలో దిక్కుమొక్కు లేని రాష్ట్రాన్ని ఒడ్డున పడేయగల నాయకుడు కావాలి.  కేంద్రప్రభుత్వ సంస్థలు...రాజధాని..వేల కోట్ల ఆస్తులు అన్ని హైదరాబాద్‌లోనే మిగిలిపోయాయి. అంత నిరాశలోనూ ఒక్కటే ఆశ..ఒక్కడి మీదే ఆశ..ఒక్కడున్నాడన్న భరోసా...ఆ  ఒక్కడు..తొమ్మది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాట పట్టించిన మొనగాడు. పాలనకే కొత్త భాష్యం చెప్పిన అడ్మినిస్ట్రేటర్. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రమే ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఒడ్డున పడేయగలడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టంగట్టారు. జూన్ 8, 2014 నాడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఆయన అధికారంలోకి వచ్చి నేటితో రెండు సంవత్సరాలు పూర్తైంది.

 

ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి ఏపీ పరిస్థితి మునిగేనావ లాంటిది. రాజధాని లేదు..ఆదాయం లేదు..పాతాళంలా కనిపించే రెవెన్యూలోటు..చేతిలో చిల్లిగవ్వ లేదు. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలన్న ఆలోచనతో తలచుకుంటేనే సగటు ఆంధ్రుడి గుండె చెరువైపోతోంది. ఇలాంటి పరిస్థితిలో అధికారం ముళ్ల కిరీటం లాంటిది. వేరే ఎవరైనా అయితే భయపడి పారిపోయేవారు కాని అక్కడుంది చంద్రబాబు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గెలిచిన మొండి ధైర్యం ఆయన సొంతం. అన్యాయం జరిగిందని ఆగిపోకుండా.. ఒక సవాల్‌గా స్వీకరించారు. పరిపాలనలో ఎదురయ్యే చిక్కుముళ్లను అధిగమిస్తూనే..సుధీర్ఘమైన ప్రణాళికతో రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు.

 

అధికారంలోకి వస్తూనే కరెంట్ కష్టాలను అంచనా వేసి ముందుగా మెల్కొని రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సమయంలో ఆయన ముందున్న ప్రధాన సమస్య రాజధాని..రాజధాని ఎక్కడో చెప్పకుండా కట్టుబట్టలతో బజారుకిడ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే రాజధాని ఎంపిక కమిటీని నియమించి అనేక తర్జనభర్జనల మధ్య అమరావతిని రాజధానిగా నిర్ణయించారు బాబు. అంతేకాదు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని రీతిలో రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారు. దీని కోసం రైతుల నుంచి ఘర్షణలు లేవు, ఉద్యమాలు జరగలేదు. దటీజ్ చంద్రబాబు. అలనాటి అమరావతిని మించిన మహానగరాన్ని నిర్మించాలనే మహా సంకల్పంతో రంగంలోకి దిగి..విదేశీ సంస్థల్ని సైతం రంగంలోకి దింపి, దేశం కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశారు.

 

రాష్ట్రానికి వెన్నెముక లాంటి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా తను ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీని అమలు చేశారు. వ్యవసాయానికి మూలాధారమైన సాగునీటి రంగాన్ని బలోపేతం చేయాలని ప్రణాళిక రూపొందించి, మహమహులు సైతం టచ్ చేయడానికే భయపడిన నదుల అనుసంధానాన్ని విజయవంతంగా చేసి చూపించారు చంద్రన్న. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతోపాటు తోటపల్లి, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్ట్, వంశధార-2, పట్టిసీమ ప్రాజెక్ట్‌లను పట్టాలపైకి ఎక్కించారు. విడిపోతే జీతాలు కూడా ఇవ్వలేమన్న భయం నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే అధికమొత్తంలో జీతభత్యాలు ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని చేర్చారు. ఇక సంక్షేమ రంగం గురించి చూస్తే రూ. 200గా వృద్థాప్య పెన్షన్‌ను రూ. 1500కు పెంచి ఎన్ని కష్టాలు వచ్చినా అభాగ్యులకు అండగా నిలబడ్డారు. అంతేకాదు సంక్షేమంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చి సంక్షేమ ఫలాలు పేదవాడి ఇంటికి చేరేలా చేశారు.

 

విభజనకు ముందు ఉన్నత విద్యాసంస్థలన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో నిట్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, మంగళగిరిలో ఎయిమ్స్‌ ఇలా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్ని ఏపీకి తీసుకువచ్చారు. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామీకీకరణ కూడా అత్యవసరం. ఈ విషయం చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అలాంటి ముందుచూపుతోనే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లతో పోటీపడి మరి తీసుకువచ్చారు. ఇప్పుడు నవ్యాంధ్ర వేగంగా కోలుకోవాలంటే శీఘ్రగతిన పారిశ్రామికీకరణ జరగాలి. అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో పర్యటించి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను  అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించారు. చంద్రబాబు కృషి ఫలితంగా తొలి ఏడాదిలోనే రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీ ఆకర్షించింది. అంతేకాదు స్నేహపూర్వక పారిశ్రామిక వాతావరణంలో దేశంలోనే రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీసిటీ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి..మరికొన్ని సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

 

ఇవి మాత్రమే కాకుండా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, నాలుగు లైన్ల రహదారులు, పర్యాటక సర్క్యూట్లు, మీ ఇంటికి మీ భూమి, స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్, పోర్టులు, విమానాశ్రయాలు ఇలా బృహత్ ప్రణాళికతో రాష్ట్రాన్ని శిథిలం నుంచి శిఖరాగ్రానికి చేర్చేందుకు ఒక శ్రామికుడిలా కష్టపడుతున్నారు చంద్రన్న. ఈ సమరంలో ఎన్నో అటుపోట్లను ఆయన ఎదుర్కోన్నారు..ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. సోదర తెలంగాణ రాష్ట్రం చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వడం, సంస్థలు, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాకపోవడం, కేంద్ర ప్రభుత్వ సాయం అనుకున్న స్థాయిలో లేకపోవడం, కులాల కుమ్ములాటలు, ప్రతిపక్షనేత నుంచి ఇబ్బందులు వంటి సమస్యలు ముఖ్యమంత్రిని వేధిస్తున్నాయి. వీటికి తోడు పరిపాలనలో కీలకమైన సచివాలయ ఉద్యోగులు అనుకున్న సమయానికి అమరావతికి చేరుకోకపోవడంతో చంద్రబాబు డీలా పడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నా తనతో కలిసివచ్చే వారు లేకపోవడం ఆయన్ని మానసికంగా క్రుంగదీస్తోంది. అయినా ధృడ సంకల్పంతో ముందుగా సాగుతున్న చంద్రబాబు ఆంధ్రులు కలలుగన్న స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లాలని ఆకాంక్షిద్దాం.