తాజ్ మహాల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా తెరుచుకోనున్న అనేక సందర్శనీయ స్థలాలు

ప్రపంచ వింతల్లో ఒకటైన అద్భుత కట్టడం తాజ్ మహల్ సందర్శనకు ఈనెల ఆరు నుంచి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశంలోని అన్ని సందర్శనీయ, స్మారక ప్రాంతాలను ఈనెల ఆరవ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా కారణంగా దేశవిదేశాల్లోని దర్శనీయ స్థలాలకు, పర్యాటక ప్రాంతాలన్నింటినీ మూసివేశారు. మన దేశంలో దాదాపు మూడువేల ఐదువందలకు పైగా సందర్శనీయ స్థలాలను కేంద్ర పురావస్తు పరిశోధన సంస్థ(ఏఏస్ఐ) మూసివేసింది. మార్చి 17 నుంచి జూన్ 8 వరకు వివిధ మతాలకు చెందిన దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర ప్రార్థనా స్థలాలు కూడా మూసివేశారు. అన్ లాక్ మొదటి దశలో ఆధ్యాత్మిక కేంద్రాలను తెరిచారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ కొనసాగుతుంది. తాజాగా పర్యాటక, సందర్శనీయ, చారిత్రాత్మక ప్రాంతాల్లో పర్యాటనలకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.