మరోసారి కేసీఆర్ శకమా? వద్దు బాబోయ్!

పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్‌ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ విషయంలో స్పష్టత వున్నప్పటికీ, ఇక తప్పదు కాబట్టి, కాడి వదిలేయలేరు కాబట్టి ఎన్నికల ప్రచారంలో మేకపోతు గాంభీర్యపు మాటలు చెబుతూనే వున్నారు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు, రేవంత్ రెడ్డి మాట తప్పాడని అనడం, కాంగ్రెస్, బీజేపీ ఒకటే అనడం, బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అనడం... ఇలాంటివన్నీ అలా వుంచితే, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న ఒక బంపర్ ఆఫర్ని విని జనం భయంతో వణికిపోతున్నారు. కేటీఆర్ ఇస్తున్న ఆ ఆఫర్ ఏంటంటే, ‘‘ఈసారి ఎన్నికలలో బీఆర్ఎస్‌ని 12 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించండి. మా నాయకుడు కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతాడు. సంవత్సరం తిరిగేసరికి తెలంగాణలో మరోసారి కేసీఆర్ శకం వస్తుంది’.

కేటీఆర్ ఇస్తున్న ఈ ఆఫర్ విని జనం భయపడిపోతున్నారు. ఒక దశాబ్దం పాటు కేసీఆర్ చల్లని పాలనను చవిచూసిన ప్రజలు మరోసారి ఆ చల్లని పాలనని కోరుకోవడం లేదు. రెండుసార్లు అవకాశం ఇచ్చినందుకే ఆకాశంలో వున్న తెలంగాణని అప్పుల పాతాళంలోకి పడేశారు. మళ్ళీ ఇంకోసారి కేసీఆర్ శకం వస్తే భరించడం మావల్ల కాదు బాబోయ్ అనుకుంటున్నారు. అందువల్ల కేటీఆర్ ఇస్తున్న బంపర్ ఆఫర్ వల్ల  ప్లస్ జరగకపోగా మైనస్ జరిగే అవకాశాలున్నాయి. 12 స్థానాలు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ కేసీఆర్ శకాన్ని తేవడం ఎందుకు అని ఓటర్లు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది మరి.