టి20 వరల్డ్ కప్ లోఓపెనర్ గా కింగ్ కోహ్లీ

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ లో స్ట్రైక్ రేట్ కారణంగానే బెంగళూరు ప్రదర్శన పేలవంగా ఉందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే కోహ్లీ వినా ఆ జట్టులో మిగిలిన బ్యాట్స్ మన్ ఎవరూ అంచనాల మేరకు రాణించకపోవడంతోనే కోహ్లీపై ఒత్తిడి పెరిగి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంటోందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

మొత్తం మీద ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శన ఈ ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ లో అతడి స్థానంపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు కోహ్లీకి వరల్డ్ కప్ ఆడే చాన్స్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో జట్టు ఎంపికకు సమాయత్తమౌతున్న బీసీసీఐ, సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో కింగ్ కోహ్లీ ఓపెనర్ గా ఆడతాడని సంకేతాలు ఇచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. 

ఐపీఎల్ లో బేంగళూరు జట్టుకు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ ఆ జట్టుకు శుభారంభాన్ని అందించడమే కాకుండా మంచి స్కోర్లు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో ఒక సెంచరీ సాధించి ఐపీల్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీని స్కిప్పర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెన్ చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. అందుకు కోహ్లీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.