ఉండవల్లి కాదు..ఉసరవెల్లి : హరీష్ రావు
posted on Jan 26, 2013 11:12AM

"వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సిఎల్‌పి నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి 41మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు పంపినప్పుడు ఉండవల్లి ఎందుకు వ్యతిరేకించలేదు. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణపై హామీ ఇచ్చినప్పుడు… కరీంనగర్ సభలో సోనియాగాంధీ ప్రసంగాన్ని అనువాదం చేసినప్పుడు, రాష్ట్రపతి పార్లమెంట్‌లో ప్రస్తావించినప్పుడు ఉండవెల్లికి సమైక్యాంధ్ర గుర్తుకు రాలేదా” అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉండవెల్లి అరుణ్ కుమార్ ను విమర్శించారు.
ఆయన ఉండవల్లి కాదు, ఒక ఊసరవెల్లి అని ఎద్దేవా చేశారు. ఆయన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని, 2009 డిసెంబర్ 9వ తేదీ తర్వాత తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని అభిప్రాయపడి, ఇప్పుడేమో సమైక్యాంధ్ర సభ పెట్టడం విడ్డూరం అని అన్నారు. ఈ సభలో పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పాల్గొనడ మేమిటని, ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులా, ఆంధ్ర ప్రాంతానికి మాత్రమేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాజమండ్రి సభలో వైఎస్సార్‌సిపి, దాని అధ్యక్షులు జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, ఆయన ఎందుకు జైళ్లో ఉండాల్సి వచ్చిందో ప్రజలకు వివరించకపోవడం పలు అను మానాలకు దారితీస్తుందని అన్నారు.