రాయలసీమను అమ్మిన సొమ్ముతో హైదరాబాద్ కు నిజాం సోకులు!


సర్కార్లను, రాయలసీమను బ్రిటిష్ వాళ్ళకు అమ్మిన సొమ్ముతో

 హైదరాబాద్ కు నిజాం సోకులు!

-డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు
]

 

 

Abk prasad News, Abk prasad Latest news, telangana nizam, telangana issueAbk prasad News, Abk prasad Latest news, telangana nizam, telangana issue

 

 

మైసూర్, మహారాష్ట్ర యుద్ధాలలో మొలబంటిగా కూరుకుపోయిన నిజాం ప్రభువులు, ఈ రెండు ప్రాంతాలపైన ఆధిపత్యం కోసం ఒక వైపునుంచి ఫ్రెంచివాళ్ళు, ఇంకొక వైపునుంచి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలకులు పెనుగులాడుతూండగా అంతిమంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వైపు కొమ్ముకాసిన వాళ్ళూ, కృష్ణానదికి దక్షిణంగా ఉన్న దేశాన్నంతా (హదుర్, తిరుచునాపల్లి జిల్లాలు సహా)నిజాం సలాబత్ జంగ్ ఒక దశలో ఫ్రెంచివాళ్ళకు ధారాదత్తం చేశాడు. కృష్ణాలోని నిజాంపట్నం, ఆలమ్మనార్ ప్రాంతాలు, గోదావరిలోని కొండవీడు, నర్సాపురంలను కూడా మొదట్లో నిజాం ప్రభువులు ఫ్రెంచివాళ్ళకు అమ్మి సోమ్ముచేసుకున్నారు!

 

క్రమంగా బ్రిటిష్ వాళ్ళు ఈస్టిండియా కంపెనీ గొడుగు కింద తమ రాజ్యవిస్తరణకు భారతదేశంలో బలమైన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఒక్క దక్షిణ భారతంలోనే కాదు, యావద్భారతంలోనే పెక్కు హైందవ రాచరిక ప్రభువులంతా బ్రిటిష్ వాడికి సలాములు కొట్టుకుంటూ దేశద్రోహానికి గజ్జెకట్టిన సమయంలో అదే బ్రిటిష్ వాళ్ళు పరాయి చొరబాటును, వారి పాలనా విస్తరణను ఎదురొడ్డి నిలిచిన దేశభక్తులు, మొనగాళ్ళూ - మైసూర్ అధినేతపైన హైదరాలీ అతని కొడుకు టిప్పుసుల్తాన్ అని మరిచిపోరాదు! ఆ ఘడియలలో కూడా నిజాం ప్రభువులు ఈ ముస్లీం వీరులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళతో కుట్రలు పన్నినవాళ్ళు నిజాం ప్రభువులనీ మనం మరవలేము!
 

"శత్రువుకు శత్రువు మిత్రుడన్న"  సామెతకు తగినట్టుగా నిజాం పాలకులు కర్నాటక, మహారాష్ట్ర పాలకులపైన కత్తిఎత్తిన బ్రిటిష్ వాళ్ళతో కుమ్ముక్కు అయినందుకు బ్రిటిష్ పాలకులకు ఉత్తర సర్కారులను, మధ్య సర్కారులలో కొన్ని ప్రాంతాలనూ, పూర్తిగా రాయలసీమనూ టోకుగానూ, చిల్లరగానూ అపారమైన పరిహారం తీసుకొని ధారాదత్తం చేసేశారు! ఇదంతా బ్రిటిష్ వాడితో నిజాం ప్రభువులు కుదుర్చుకున్న సైన్యసహకార సంధి ఫలితంగా జరిగింది. దాంతో హైదరాబాద్ పైన బ్రిటిష్ వాడి పెత్తనానికి దగ్గర 'తొవ్వ' ఏర్పడింది. మొగలాయీల నుంచి దండయాత్రల ద్వారా అప్పనంగా పొందిన హైదరాబాద్ నగరం అలా బ్రిటిష్ వాడి "సైన్య సహకారం''తో నిజాం ప్రభువుల 'రక్షిత సంస్థానం'గా రూపొందింది! తమకు ప్రక్కలో బల్లెంగా ఉన్న మహారాష్ట్ర పాలకుల బెడదను ఎదుర్కోవడానికి, బ్రిటిష్ వారికి కూడా దక్కన్ లో తమ సామ్రాజ్య విస్తరణ కోసం మహారాష్ట్ర పేష్వాలతో తలపట్లు తప్పలేదు కనుక ప్రభువులను ఉపయోగించుకుని అటు మహారాష్ట్ర ప్రజల్ని, ఇటు సర్కారు, రాయలసీమ, హైదరాబాద్ సంస్థాన ప్రజలనూ అందరూ కలిసి విరగతొక్కేశారు!


అందుకే హైదరాబాద్ తెలుగుభాషా ప్రజలు నివశించే తెలంగాణలో అంతర్భాగంగా కాకుండా ప్రత్యేక సంస్థానంగా ఉంటూ వచ్చింది. ఆ సంస్థానాన్ని నిరంకుశ పాలనకోసం కేంద్రంగా చేసుకోడానికి తెలంగాణాలోని ఆంధ్రుల (తెలుగువారిని), మరాఠీల, కన్నడిగుల సంపదనూ, శ్రమనూ నిజాం ప్రభువులు దోచుకు తిన్నారు. ఇది చారిత్రిక సత్యం. అందుకే హైదరాబాద్ నగరంగాని, సికిందరాబాదు గానీ, నేటి రంగారెడ్డి జిల్లాగానీ నిజాం ఆధీన "సుబాలు''(ప్రాంతాలు)గా ప్రకటించుకున్న తొల్లింటి 16 జిల్లాలలో ఎన్నడూ లేవు! ఇది చాలా ఆసక్తికరమైన వెల్లడి! నిజాం పాలకుల హయాములో 1901లో ఒకసారి, 1905లో మరొకసారి జిల్లాలను విభజించారు. హైదరాబాదు సంస్థానాన్ని నాలుగు ప్రాంతాలు (సుబాలు)గా విభజించారు. ఈ సుబాలను 17 జిల్లాలుగా, 104 తాలూకాలుగా మళ్ళీ విభజించారు.


ఈ సుబాలలో చేరని జిలాలను నల్గొండ జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత చరిత్ర పరిశోధకుడు, సాహిత్యవేత్త అయిన కుర్రా జితేంద్రబాబు గుర్తించారు. అవి అత్రాఫ్ బల్దా జిల్లా, ఇందులోని తాలుకాలు 4 : మలక్ పేట, అంబరుపేట, థారూరు, మేడ్చల్; కాని నిజాం సుబాలలో చేర్చనిదీ, చేరనిదీ హైదరాబాద్ జిల్లా. ఇందులోనివే హైదరాబాదు, సికిందరాబాద్ లు. చరిత్ర తెలియకుండా ఆందోళన చేసే రాజకీయ నిరుద్యోగులకు (కొందరు సి.పి.ఐ. నాయకులు సహా) ఏయే ప్రాంతాల పెట్టుబడిదారులు హైదరాబాదును సాకుతూ వచ్చారో, వీరిలో ఏయే విదేశీ కంపెనీలకు చెందినవాళ్ళున్నారో కూడా తెలియదు!
 

రెండు ప్రపంచయుద్ధాలలోనూ  బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అండదండలు అందించి సాయపడినవాళ్ళు నిజాం ప్రభువులే. దక్కన్ సహా మొత్తం దక్షిణభారతంపై బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యానికి మార్గం సుగుమం చేసినవాళ్ళు నిజాములు. ఈ పరిణామానికి దోహదం చేసిన ప్రముఖులలలో నవాబ్ అఫ్జలుద్దౌలా, అతని మంత్రి మొదటి సాలార్ జంగ్ ఉన్నారు.
 

18-19 శతాబ్దాలలో బ్రిటిష్ వాళ్ళ ప్రవేశంతోనే హైదరాబాదు సంస్థానంలో (హైదరాబాద్ లోనే) తిష్టవేసిన బ్రిటిష్ వ్యాపార కంపెనీ "పామర్ అండ్ కో'' కంపెనీ. ఆ కంపెనీ అధినేత విలియమ్ పామర్ 1800లోనే నిజాం సైన్యంలో జీవితం ప్రారంభించాడు. ఇతను నిజాం సైన్యంలో చేరి పనిచేసిన తొలి బ్రిటిష్ పౌరుడని ప్రతీతి. 1814 నాటికి బ్రిటన్ తరపున ఒక సాధికార ప్రతినిధిగానే వ్యవహరిస్తూ నిజాం పాలకుల విధానాలను శాసించే స్థితికి ఎదిగిపోయిన వ్యాపారి పామర్. 18వ శతాబ్దం ఆఖరిదశలో నిజాం సైన్యానికి నిజాం జీతాలు చెల్లించడానికి బొక్కసం ఖాళీ అయి దివాళా ఎత్తిన స్థితిలు, గతంలో ఫ్రెంచి వాళ్ళు ఆదుకున్నట్టుగానే బ్రిటిష్ వాళ్ళు ఈ పామర్ కంపెనీ ద్వారానే జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేశారని మరిచిపోరాదు! చందులాల్ అనే వ్యాపారి ద్వారా పామర్ కంపెనీలో నిజాంకు ఒప్పందం కుదిర్చిన వాడు రసలె అనే బ్రిటిష్ అధికారి. ఆనాడు హైదరాబాద్ సంస్థాన ప్రజలు ఈ కంపెనీని ఓ వ్యాపారసంస్థగా కాకుండా బ్రిటిష్ ప్రభుత్వమే హైదరాబాద్ లో ఉన్నట్టు భావించేవారు!



హైదరాబాద్ సంస్థాన రాజకీయ వ్యవస్థలో ఈ "పామర్ అండ్ కో'' చాలా దుష్టమైన ప్రభావం కల్గించిందని సుప్రసిద్ధ నగర చరిత్రకారిణి సరోజినీ రేగాని "నిజాం-బ్రిటిష్ సంబంధాలు'' అన్న విశిష్ట రచనలో పేర్కొన్నారు ! ఈ  "పామర్ అండ్ కో'' కంపెనీని ఈస్టిండియా కంపెనీ సర్కారులను, రాయలసీమ ప్రాంతాలను దోచుకోగా వొనగూడిన ఆదాయం ఏడాదికి రూ.30 లక్షలని [ఈనాటి అంచనా ప్రకారం అది లక్షలకోట్లు] తేలింది! అంటే పామర్ అండ్ కంపెనీకి నిజాం ఇచ్చిన దానికన్నా ఆరులక్షలు అదనంగా వచ్చేది. అందుకే చరిత్రకారిణి రేగాని యిలా వ్యాఖ్యానించింది "హైదరాబాద్ లో ఈ వ్యాపార (పామర్) సంస్థను తెరవడమే హైదరాబాద్ రాజ్య దోపిడీకి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ జిల్లాలను కొల్లగొట్టింది''! అల నిజాం ప్రతిపత్తిని గౌరవిస్తున్నట్టు ఫ్రెంచివాళ్ళు ఒక దశవరకూ నటిస్తూ నిజామే సైన్యానికి జీతాలు అందజేసే ఏర్పాటును లోపాయికారిగా చేయగా, ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళూ అదే పద్ధతిలో నిజాం సైన్యం జీతాలు కూడా చెల్లించుతూ వచ్చారు! ఇలా ఫ్రెంచి, బ్రిటిష్ సామ్రాజ్య సేనలతో పాటు తమ సిపాయీలకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఫ్రెంచి, నిజాం సిపాయిలు నిజాంపై తిరుగుబాటు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే సర్కారు ప్రాంతాలనూ, రాయలసీమనేగాక, హైదరాబాద్ ను కూడా బ్రిటిష్ వాళ్ళకి నిజాం అమ్మేశాడు!



తరువాత నిజాముల్ ముల్క్ దక్కను సుబేదారయిన తర్వాత తన ఆక్రమణలో వున్నా రాజ్యాన్ని 24 పరగణాలుగా విభజించాడు. వీటిలో రాజమండ్రి, మొగల్తూరు ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంతేగాదు, మహారాష్ట్ర ప్రాంతాల్ని జయించాలంటే దక్కన్ లో నిజాం అండదండలతోనే సాధ్యం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వ్యూహం పన్నిన ఫలితంగా కూడా మహారాష్ట్రులు చెలరేగిపోయి దక్కన్ లోని శ్రీకాకుళం దాకా పాకిపోయారు! నిజాం పాలకుల హయాములోనే యానాం కూడా తెలుగువారికి దక్కకుండా పోయింది! నిజాం పాలకుల ఈ బలహీనత వల్లనే, భీమునిపట్నంనుంచి మచిలీపట్నం (బందరు)దాకా తెలుగుప్రజలపైన, తెలుగుప్రాంతాలపైన తమ ఆధిపత్యాన్ని ఫ్రెంచి, బ్రిటిష్ వాళ్ళకు వివిధ దశల్లో బదిలీ చేసి భారీ పరిహారం పొందారు. హైదరాబాద్ లో ఆనాటికి ఉన్న బ్యాంకులను కొల్లగొట్టి ఫ్రెంచి సైనికులకు జీతాలను నిజాంద్వారా చెల్లింపజేసినా వాడు బుస్సీ!



1803 మరాఠీ యుద్ధం చివరిదశలో నిజాం సైనికదళాల అసమర్థత, నిర్వీర్యత బట్టబయలయింది. ఆ సమయంలో నిజాం సైన్యాన్ని శక్తివంతమైన దళంగా పునర్వ్యవస్థీకరించడం కోసం బ్రిటిష్ జనరల్ వెలస్లీ హైదరాబాద్ లోని తమ రెసిడెంట్ కు ఆదేశాలిచ్చాడు. నిజాం ఆధీనంలో ఉన్న బీరార్ ఆదాయమంతా ఆశ్వికుల నిర్వహణకోసం ఖర్చుపెట్టాలని బ్రిటిష్ వాళ్ళు షరతు పెట్టారు. ఎందుకు? ఆ డబ్బుని నిరుద్యోగులుగా ఉన్న యూరోపియన్ ఆఫీసర్లు చాలామందిని నిజాం సైన్యాలకు దళాధిపతులుగా నియమించి, జీతాల కింద జమచేశారు!


 
ఆ మాటకొస్తే, మొత్తం నిజాం దళాలను, బ్రిటిష్ దళాల జీతవేతనాలను ఆదుకున్నది హైదరాబాద్ లో తిష్టవేసిన బ్రిటిష్ కంపెనీ "పామర్ అండ్ కంపెనీ''యే. దక్కన్ లో నిరంకుశ రాచరికాలకు, తమ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా దక్కన్ లో తలెత్తే తిరుగుబాట్లను అణచివేయడం నిజాంకు, బ్రిటిష్ వారికీ యిష్టం. నిజాం రాజ్యంలో వ్యాపార లావాదేవీల ద్వారా విలియమ్ పామర్ బ్యాంకింగ్ సంస్థను నెలకొల్పడమేగాక, బ్యాంకింగ్ వ్యవస్థలో పామర్ సంస్థలతో పాటు బ్రిటిష్ రెసిడెంట్ అయిన హెన్రీ రసెల్ మిత్రుడయిన శామ్యూల్ రసెల్ సంస్థలు కూడా పెట్టుబడులు గుప్పించాయి.



ఇలా హైదరాబాద్ నిర్మాణంలో గతంలో ఫ్రెంచి, బ్రిటిష్ వ్యాపారసంస్థలు పెట్టుబడులు గుప్పించగా, సర్కారుల్ని, రాయలసీమను, తెలంగాణా గ్రామసీమల్ని కొల్లగొట్టడం ద్వారా నిజాం పాలకులు హైదరాబాద్ ను నిర్మించగా, హైదరాబాద్ ఆధునిక నిర్మాణంలో ఒక్క కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులే గాక తెలంగాణాలోని మోతుబరులయిన పెట్టుబడిదారుల (అటూ, యిటూ కూడా ఎన్.ఆర్.ఐ.లు) పెట్టుబడులతో పాటు భారతదేశం నలుమూలలనుంచి వివిధ రాష్ట్రాల పెట్టుబడిదారులు పెట్టుబడులు కూడా ఉన్నాయి; అందుకే హైదరాబాద్ నగరం దక్కన్ లోని ఈ భాగంలో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల ప్రజలకు, సంస్కృతులకు సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉందని మరచిపోరాదు. బహశా అందుకే మంత్రులు నాగేందర్, ముఖేష్ గౌడ్ లు విభిన్న ప్రాంతాల, ప్రజల భాషా సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచడం శ్రేయస్కరమని ప్రతిపాదించి ఉంటారు!