Sylvester Stallone – అతని జీవితమే ఓ సినిమా!

 

అనగనగా ఓ హీరో! అతను నానాకష్టాలూ పడతాడు. ఆ కష్టాలు చూసినవారెవ్వరికైనా ‘ఇంతకంటే దారుణమైన జీవితం ఉంటుందా!’ అన్న అనుమానం వచ్చేస్తుంది. కానీ మన హీరోకి మాత్రం అలాంటి అనుమానం ఏమీ ఉండదు. ప్రతి కష్టాన్నీ అతను నిబ్బరంగా ఎదుర్కొంటాడు, చివరికి తను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాంటి హీరోలు వెండితెర మీదే కాదు... మన మధ్యన కూడా కొందరున్నారు. కావాలంటే చూడండి!

 

సిల్వస్టర్ స్టలోన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 70 ఏళ్ల వయసులో కూడా హాలీవుడ్లో హంగామా సృష్టిస్తున్న టాప్ హీరో. కానీ ఈ స్థాయికి చేరుకునేందుకు అతను సాగించిన ప్రయాణం అసమాన్యం. స్టలోన్ తండ్రి అమెరికాలో స్థిరపడిన ఇటాలియన్, తల్లి రష్యన్. స్టలోన్ పుట్టుకతోనే దురదృష్టం తోడుగా లోకంలోకి అడుగుపెట్టాడు. అతన్ని తల్లి గర్భం నుంచి బయటకు తీసేందుకు పటకారు (forceps) ఉపయోగించాల్సి వచ్చింది. దాని వల్ల అతని మొహంలోని ఒక నరం దెబ్బతిని పక్షవాతం వచ్చేసింది. అతని పెదాలు, నాలుక, దవడలోని కొంత భాగం సరిగా పనిచేయకుండా పోయింది. స్టాలిన్ కష్టాలకు ఇది ఒక ఆరంభం మాత్రమే!

 

స్టలోన్కు తొమ్మిదేళ్ల వయసు ఉండగా... అతని తల్లిదండ్రులు విడిపోయారు. అతని ఆలనాపాలనా తల్లే చూసుకోసాగింది. కానీ స్టలోన్ చదువులో చురుగ్గా లేకపోవడంతో, తల్లి అతన్ని ఒక సెలూన్లో ఉద్యోగానికి పెట్టింది. కానీ ఆ ఉద్యగం అతన్ని మరింత పేదరికంలోకి నెట్టేసింది. స్టలోన్కు 24 ఏళ్లు వచ్చేసరికి ఏ ఉద్యోగమూ లేకుండా పోయింది. అతను ఉంటున్న అపార్టుమెంట్ అద్దెని కూడా కట్టలేని పరిస్థితి. దాంతో ఓ రోజున కట్టుబట్టలతో సహా ఆ అపార్టుమెంటు నుంచి బయటపడక తప్పలేదు. తలదాచుకోవడానికి ఆరడుగుల అండ కూడా దొరక్కపోవడంతో... న్యూయార్కులోని బస్టాండులోనే మూడు వారాలు గడిపాడట స్టలోన్.

 

ఆ సమయంలో స్టలోన్కు ఒక వరంలాంటి శాపం దక్కింది. చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్న అతడికి ఒక పోర్న్ ఫిల్మ్ (అశ్లీల చిత్రం)లో చిన్న పాత్ర దక్కింది. ఆ పాత్రకుగాను అతనికి 200 డాలర్లు ఇస్తామని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేదు, తల దాచుకోవడానికి నెత్తి మీద నీడ లేదు. అలాంటి సమయంలో స్టలోన్కు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఆ అవకాశంతో స్టలోన్ జీవితమైతే మారిపోలేదు కానీ చిన్నాచితకా వేషాలు దొరకడం మొదలైంది.

 

ఒకరోజు స్టలోన్ టీవీలో బాక్సింగ్ పోటీ చూస్తున్నాడు. అందులో మహమ్మద్ ఆలీ, చక్ వెప్నర్ అనే బాక్సర్లు హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఆ పోటీ చూసిన స్టలోన్ మనసులో ఓ ఆలోచన మెదిలింది. బాక్సింగ్ పోటీ నేపథ్యంలో ఒక సినిమా కథని ఎందుకు రాయకూడదనిపించింది. వెంటనే తన రూమ్కి వెళ్లి మూడు రోజుల పాటు ఏకధాటిగా కూర్చుని ఒక కథని అల్లాడు. అదే Rocky! తను రాసిన స్క్రిప్ట్ను తీసుకుని స్టలోన్ ప్రొడ్యూసర్ల దగ్గరకి బయల్దేరాడు.

 

స్టలోన్ రాసిన కథ చాలామందికి నచ్చింది. కానీ ఆ కథలో ప్రధాన పాత్రని తనే పోషిస్తానని స్టలోన్ చెప్పడంతో ఎవ్వరూ సినిమా తీసేందుకు ధైర్యం చేయలేదు. చివరికి ఒక నిర్మాత ఆ కథని 3,50,000 డాలర్లకి కొనేందుకు ఒప్పుకొన్నాడు. అంత భారీ ఆఫర్ వచ్చినా కూడా స్టలోన్ తన పంతం వీడలేదు. అందులో రాకీ పాత్ర తను పోషించాల్సిందే అని పట్టుపట్టాడు. ఇక చేసేదేమీ లేక స్టలోన్కు కేవలం 35,000 డాలర్లు ముట్టచెప్పి అతనితో ఆ పాత్ర చేయించారు.

 

రాకీ విడుదల తర్వాత స్టలోన్ ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది. అందులో అతని అద్భుతమైన నటనకీ, రచనకీ ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. కేవలం పదకొండు లక్షల డాలర్లతో తీసిన ఆ చిత్రం 22 కోట్ల డాలర్లను వసూలు చేసింది. ఆ ఒక్క సినిమాకే ఆరు సీక్వెల్స్ తీశారంటే హాలీవుడ్లో దాని ప్రభావం ఏపాటిదో అర్థమవుతుంది. ఆ సీక్వెల్స్తో పాటుగా Rambo, Cliffhanger లాంటి 70కి పైగా చిత్రాలతో స్టలోన్ హాలీవుడ్ చరిత్రలోనే తనదైన అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు.

 

స్టలోన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకి ఇష్టమైన కుక్కపిల్లని 50 డాలర్లకు అమ్మేశాడట. కానీ రాకీ సినిమా కోసం తనకి 35,000 డాలర్లు ముట్టగానే వెంటనే ఆ కుక్కని తిరిగి కొనేందుకు బయల్దేరాడు. ఆ కుక్కని కొనుక్కొన్న వ్యక్తి తరచూ బార్కి వస్తాడని తెలియడంతో మూడురోజులపాటు అతని కోసం కాపుకాశాడు. చివరికి అతను కనిపించనైతే కనిపించాడు కానీ... ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ‘ఆఖరికి 3,000 డాలర్లు చెల్లించి నానా తిట్లూ తిన్న తర్వాత నాకు ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు అతను ఒప్పుకున్నాడు’ అని స్టలోన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హుమ్! స్టలోన్ తను కోల్పోయినవి కూడా తిరిగి సాధించుకున్నాడన్నమాట. నిజమైన విజయం అంటే అంతే కదా!!!

- నిర్జర.

 

 

Related Segment News