ప్రేమికుడి తోడుంటే... ఎంతటి నొప్పినైనా ఓర్చుకోవచ్చు!
posted on Sep 14, 2018 11:57AM
ప్రేమలో మునిగిపోయినవారు లోకాన్నే మర్చిపోతారని అంటారు. ప్రేమతో ఎంతటి కష్టాన్నయినా జయించవచ్చని చెబుతారు. కానీ నొప్పితో విలవిల్లాడే మనిషికి ప్రేమ మందులా పనిచేస్తుందని నిరూపిస్తున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన గోల్డ్స్టీన్ అనే పరిశోధకుడి వచ్చిన ఆలోచన ఫలితంగానే ఈ పరిశోధన మొదలైంది. ఈ గోల్డ్స్టీన్ అనే ఆయన, తన భార్య ప్రసవిస్తుండగా పక్కనే ఉన్నాడట. ఆ సమయంలో నొప్పితో విలవిల్లాడిపోతున్న తన భార్యని ఎలా సంభాళించాలో ఆయనకి తోచలేదు. గట్టిగా ఆమె చేతిని పట్టుకుని, ఆమెకి తను తోడుగా ఉన్నానన్న ధైర్యాన్ని అందించాడు. ఆశ్చర్యం! అతని స్పర్శతో ఆమె నొప్పి చాలావరకు తగ్గిపోయింది. దాంతో ప్రేమికుడి స్పర్శకీ, నొప్పి తగ్గడానికీ మధ్య సంబంధాన్ని శాస్త్రీయంగా రుజువు చేయాలనుకున్నారు.
ఈ పరిశోధన కోసం 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న ఓ 22 మంది జంటలను ఎన్నుకొన్నారు. వారిలో ఆడవారికి చిన్నపాటి గుండెనొప్పి వచ్చేలా చేశారు. అలా గుండెల్లో నొప్పిగా ఉన్న సమయంలో మగవారు అక్కడ లేకుండానో, పక్కనే ఉండేలాగానో, చేతిలో చేయి వేసి పట్టుకునేలాగానో... మూడు రకాల సందర్భాలను సృష్టించారు. మొదటి రెండు సందర్భాలలోనూ నొప్పిలో పెద్దగా మార్పు రాలేదు. కానీ మూడో సందర్భంలో మాత్రం ఇద్దరి చేతులూ కలిసి ఉన్నప్పుడు... వారు ఊపిరి పీల్చుకునే తీరు (breathing rate), గుండె కొట్టుకునే వేగం (heart rate) ఒకేలా సాగాయట. దాంతో గుండెనొప్పి కూడా తగ్గిపోయిందట! అంతేకాదు! వారిద్దరి మధ్యా ఎంత ప్రేమ ఉంటే... నొప్పి తగ్గే ప్రభావం అంత ఎక్కువగా ఉన్నట్లు కూడా తేలింది. ఒకవేళ ప్రేమికుడు కనుక తన చేతిని తీసివేస్తే, నొప్పి తీవ్రత మళ్లీ పెరగడాన్ని కూడా గమనించారు.
మనిషి సంఘజీవి! తన ఎదురుగుండా ఉండేవారి ప్రవర్తన ఆధారంగా, అతని శరీరంలో తెలియకుండానే మార్పులు చోటు చేసుకుంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తుంటే, తెలియకుండానే వారి అడుగుల వేగం ఒకేతీరున మారిపోతుంది. ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే, వారి శరీర భంగిమ ఒకరినొకరు అనుకరిస్తూ కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు! అంతా కలిసి ఒక పాటని లయబద్ధంగా పాడుతూ ఉంటే... వారి గుండె, ఊపిరి వేగం ఒకే తీరుగా మారిపోతుందని ఎప్పుడోనే బయటపడింది. కానీ ప్రేమికుడి స్పర్శతో ఇద్దరి శరీరాలూ ఒకేతీరున స్పందిస్తూ, నొప్పి కూడా మాయమైపోతుందన్న కొత్త పరిశోధన ప్రేమికులకు ఒక వరంలా కనిపిస్తోంది.
- నిర్జర.