సుప్రీంకు వెళ్ళే ఆలోచన లేదు బాబు

న్యూఢిల్లీ: తన ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సిపిఐ జాతీయ కార్యదర్శి ఎబి బర్దన్‌తో భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై బురద చల్లి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తాను నిర్దోషినని 23 కేసుల్లో కోర్టులే చెప్పాయని ఆయన అన్నారు. సిబిఐ సంస్థ కాంగ్రెసు జేబు సంస్థగా మారిందని ఆయనవిమర్శించారు. రైతు పోరు బాట యాత్ర అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు.సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఉంటేనే సరియైన న్యాయం జరుగుతుందన్నారు. సిబిఐ, రైతు సమస్యలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు.