జగన్ కేసులో భానును గుచ్చి గుచ్చి ప్రశ్నించిన సీబీఐ

హైదరాబాద్: వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి అయిన భాను.. సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయన్ను అధికారులు సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో భాను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఈ కేసులో భానును సాక్షిగా సిబిఐ అధికారులు విచారించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో కొండారెడ్డి అనే గనుల వ్యాపారి ఇచ్చిన వాంగ్మూలం మేరకు సిబిఐ భానును ఇంతకు ముందు ఓసారి విచారించింది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు జరిపిన కేటాయింపులపై, పోర్టు పరిధుల మార్పుపై, రాయితీల ఒప్పందంపై సిబిఐ అధికారులు భానును విచారించినట్లు తెలుసస్తోంది. వైయస్ హయాంలో భాను మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల వ్యవహారాలు చూశారు. ఆయన ఆధీనంలో నీటి పారుదల, అడవులు, రోడ్లు, భవనాలు ఉండేవి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని భాను మీడియా ప్రతినిధులతో అన్నారు తాను నీటిపారుదల శాఖ వ్యవహారాలు మాత్రమే చూశానని, గనుల శాఖ తన పరిధిలో ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. అసలు కొండా రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పరిశీలించేందుకు తనపై అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి తనతో ఏ రోజు కూడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. తాను వాన్‌పిక్ ప్రాజెక్టుపై సిబిఐకి వివరాలు ఇచ్చానని, తాను ఏం చెప్పాననే విషయాలు వెల్లడించలేనని ఆయన అన్నారు.