స్వామికి రాహుల్ గాంధీ దొరికిపోయినట్టేనా?



సుబ్రహ్మణ్య స్వామి భారతీయ జనతా పార్టీ నాయకుడు. అయితే ఆయనను ఓ పార్టీకి చెందిన నాయకుడిగా ఎవరూ భావించరు. రాజకీయ నాయకులు ఎవరికీ తెలియకుండా చేసే పొరపాట్లను బయట పెట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. లా చదువుకున్న వ్యక్తి  కావడం వల్ల ఏ విషయంలోనైనా మెలిక మీద మెలిక వేసి అవతలి వ్యక్తులను గందరగోళానికి గురిచేయడంలో ఆయన శైలే వేరు. ఆయన ఏ విషయంలో అయినా న్యాయస్థానం మెట్లు ఎక్కారంటే ముద్దాయి స్థానంలో వున్నవారికి ముచ్చెమటలు పట్టాల్సిందే. దానికి ఒక ఉదాహరణ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన సందర్భమే. సాధారణంగా రాజకీయ నాయకులు ఆషామాషీ ఆరోపణలు చేస్తూ వుంటారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం లీగల్‌గా ఆధారాలతోనే ఆరోపణలు చేస్తూ వుంటారు. అందుకే రాజకీయ నాయకులు చాలామంది సుబ్రహ్మణ్య స్వామి దృష్టి తమ మీద పడకూడదని కోరుకుంటూ వుంటారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అలా కోరుకోలేదేమో... సుబ్రహ్మణ్య స్వామి దృష్టి ఆయన మీద పడింది... రాహుల్ గాంధీ బ్రిటన్లో కంపెనీ పెట్టడం కోసం తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారంటూ సుబ్రహ్మణ్య స్వామి పేల్చిన బాంబు కాంగ్రెస్ వర్గాల్లో కల్లోలం సృష్టించింది.

సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణల ప్రకారం రాహుల్ గాంధీ బ్రిటన్లో ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీకి తాను అందించిన డిక్లరేషన్లో తనను తాను బ్రిటీష్ జాతీయుడిగా పేర్కొన్నారు. అలా పేర్కొనడం భారత రాజ్యాంగాన్ని, నైతిక నియమావళిని ఉల్లంఘించడమే. అందువల్ల రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి. ఇలా ఆరోపిస్తూ సుబ్రహ్మణ్య స్వామి లోక్‌సభ స్పీకర్‌కి వినతి పత్రం ఇచ్చారు. ఇది కాంగ్రెస్ వర్గాలకు వణుకు పుట్టించింది. సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేస్తూ వుంటారంటూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాహుల్ గాంధీ కూడా స్వయంగా తాను బ్రిటన్లో కంపెనీ పెట్టానని, దానికి సంబంధించిన డిక్లరేషన్లో తనను తాను భారతీయుడిగానే పేర్కొన్నానని సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేట్టు లేరు. ఈ అంశం మీద పార్లమెంట్ ఎథిక్స్ కమిటీతో విచారణ జరిపించాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపించాలన్న సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్‌ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తూ వుండటం చూస్తుంటే రాహుల్ గాంధీ నిజంగానే తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి ఈ గండం నుంచి రాహుల్ గాంధీ ఎలా బయట పడతారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu