చదువు తర్వాత... మనోధైర్యం పెంచండి...
posted on Nov 5, 2015 5:35PM

తల్లిదండ్రులకు తమ పిల్లలే కంటి దీపాలు. ఆ దీపాలను కంటికి రెప్పల్లాగా కాపాడుకుంటూ వుంటారు. వారిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూ వుంటారు. అయితే ఇటీవలి కాలంలో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులను కలతకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు చదువులు చెప్పించే విషయం తర్వాత... ముందు వారిలో మనో ధైర్యం పెంచే విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతూ వుండటం బాధను కలిగిస్తోంది. మార్కులు సరిగా రాలేదనో, ఎవరో ఏదో అన్నారనో, ప్రేమ విఫలమైందనో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కారణాలను చూస్తుంటే ఇలాంటి కారణాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతారా అనిపిస్తూ వుంటుంది.
ప్రస్తుతం తల్లిదండ్రులుగానీ, విద్యా సంస్థలు గానీ విద్యార్థులను బాగా చదవండి.. బాగా చదవండి అని ఒత్తిడికి గురి చేస్తూ వుంటారు. వారిని బాగా చదివించే విషయాన్ని తర్వాత ఆలోచించవచ్చు... ముందు విద్యార్థులలో మనోధైర్యం పెరిగేలా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు కృషి చేయాల్సిన అవసరం వుంది. ఉజ్వల భవిష్యత్తు వున్న యువతీ యువకులు చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడటం ఇకపై జరగకూడదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వాలూ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వుంది.