వాల్మికి జీవితాన్ని మార్చేసిన రెండు ప్రశ్నలు ఇవే..!
posted on Oct 18, 2024 9:30AM
భారతీయ ధర్మంలో ఎందరో మహర్షులు, మరెందరో ఋషులు ఉన్నారు. వారిలో వాల్మికి మహర్షి చాలా ప్రత్యేకమైన వారు. రామాయణాన్ని రచించిన వాల్మికి మహర్షి ఎంత గొప్పవాడో.. ఆయన జీవితాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అంతే ఆశ్చర్యం వేస్తుంది. ఒక దొంగ ఒక మహర్షిగా ఎలా మారాడు అనే విషయం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా రెండు ప్రశ్నలు వాల్మికిని మహర్షిగా మారడానికి నాందిగా మారాయని చెబుతారు. అవేంటో తెలుసుకుంటే..
మహర్షి వాల్మికి అసలు పేరు రత్నాకర్. ఈయనను చిన్నతనంలోనే ఒక వ్యక్తి ఎత్తుకుపోయాడు. అతను దొంగతనాలు, దోపిడి చేసే వాడు కావడంతో రత్నాకర్ చిన్నతనం వాటి మధ్యనే గడిచింది. రత్నాకర్ పెరిగి పెద్దవాడు అయ్యాక వివాహం చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబ పోషణార్థం అతను కష్టపడకుండా ధనం సంపాదించడం కోసం దొంగతనాలు, దోపిడిలు చేసేవాడు.
ఒకరోజు దోపిడి కోసం దారి పక్కన కాపు కాసిన రత్నాకర్ కు నారద మహర్షి ఆ దారిలో వెళుతూ కనిపించాడు. నారద మహర్షి ఎవరో తెలియని రత్నాకర్ నారదుడి దగ్గర విలువైన వస్తువులున్నాయే అని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే నారదుడు రత్నాకర్ ను రెండు ప్రశ్నలు అడిగాడు.
ఎందుకు దోపిడి చేస్తున్నావు అని అడిగాడు..
కుటుంబ పోషణార్థం దోపిడి చేస్తున్నానని రత్నాకర్ సమాధానం ఇచ్చాడు.
ఇలా దోపిడి చేస్తే పాపం వస్తుంది. కుటుంబ పోషణార్థం ఈ పాపపు పనులు చేస్తున్నావు కదా.. దీని వల్ల నీకు వచ్చే పాపంలో నీ కుటుంబ సభ్యులు కూడా భాగం తీసుకుంటారా అని అడిగాడు.
రత్నాకర్ ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులతో దోపిడి కారణంగా తనకు చేకూరే పాపంలో కుటుంబ సభ్యులు కూడా భాగం పంచుకుంటారా అని అడిగాడు.
కుటుంబ సభ్యులు ఆ పాపాన్ని భాగం పంచుకోమని స్పష్టంగా చెప్పేశారు. దీంతో రత్నాకర్ కు తను చేస్తున్న పనుల మీద విరక్తి పుట్టింది. తాను చేసిన పాపపు పనులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు. దీనికోసం నారదుడిని ఆశ్రయించాడు. నారదుడు రత్నాకర్ తో రాముడి నామాన్ని జపించమని చెప్పాడు.
ఆ రోజు నుండి రత్నాకర్ రామ నామాన్ని జపిస్తూ కూర్చొన్నాడు. అలా సంవత్సరాల పాటు రామ నామ తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆయన చుట్టూ చెద పురుగులు పుట్టను కూడా కట్టేశాయి. కానీ ఆయన మాత్రం రామ నామాన్ని ఆపలేదు. రత్నాకర్ తపస్సుకు సంతోషించి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ప్రాయశ్చిత్తం చేకూర్చాడని, రత్నాకర్ కు మహర్షిగా వరం ఇచ్చాడని కథనం. తన చుట్టూ పుట్ట ఏర్పడటం ద్వారా ఈయనకు వాల్మికి అనే పేరు వచ్చిందట.