పెళ్ళికి ముందు జంటలు ఈ ఒక్క పని తప్పక చేయాలి..!
posted on Oct 16, 2024 9:30AM
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప దశ. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత జీవితం గురించి చాలా మార్పులు స్పష్టంగా ఉంటాయి. ఊహకు కూడా అందని విధంగా పెళ్లి తరువాత ఇద్దరి వ్యక్తుల జీవితాలకు మార్పులకు లోనవుతాయి. అంతేకాదు.. పెళ్లికి ముందు ప్రతి జంట మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి. అవి వివాహం తరువాత ఆర్థిక పరిస్థితులు కావచ్చు, పిల్లల ప్లానింగ్ కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు.. కాబోయే జంట ఎన్నో విషయాలలో ఎలా ఉండాలనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలాగైతే పెట్టుకుని ఉంటారో.. అదే విధంగా అవి సరిగా జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో కూడా ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఎలా సాగుతుందో.. భాగస్వామి తమతో ఎలా ఉంటారో అనే విషయాలలో కూడా బోలెడు సందేహాలు ఉంటాయి. అందుకే పెళ్లికి ముందు కాబోయే జంట కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.
అపరిచితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలసి ఒక జంటగా ఏర్పడి జీవితాన్ని కొనసాగించడం బోలెడు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. ఒకరి మీద ఒకరికి ఎన్నో సందేహాలు, మరెన్నో అంచనాలు ఉంటాయి. అదే ఇద్దరూ కలసి కౌన్సెలింగ్ తీసుకుంటే భార్యాభర్తల బంధం మీద ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో.. ఏ విషయాన్ని అయినా ఎలా సంభాషించాలో అర్థం అవుతుంది.
ఒక బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యునికేషన్ ప్రదానమైనది. ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ సాగాలంటే ఇద్దరు ఒకరికి ఒకరు గౌరవం ఇవ్వాలి. ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు శ్రద్దగా వినగలగాలి.
పెళ్లికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల భార్యాభర్తలు వైవాహిక జీవితంలో తమకున్న అంచనాలను చర్చించుకుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెళ్లి తరువాత ఈ అంచనాలకు తగ్గట్టు ఒకరికొకరు సర్దుబాటు కావచ్చు.
జీవితంలో ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు ఉంటాయి. పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తీసుకుంటే వీటి గురించి ఇద్దరికీ ఒక అవగాహన వస్తుంది. ఇద్దరూ కలిసి జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు.
కౌన్సెలర్ ముందు కాబోయే జంట తమ అభిప్రాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు వివరించడం వల్ల కాబోయే జంటకు భవిష్యత్తు గురించి, తాము ఇద్దరూ చేయాల్సిన విషయాల గురించి ఒక అవగాహన వచ్చేస్తుంది. మనసులో ఉన్న చాలా సందేహాలకు అక్కడే సమాధానాలు దొరుకుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి సులువుగా ఉంటుంది.
కాబోయే జంటలో ఎవరికైనా ఎవైనా బలహీనతలు, సమస్యలు, లోపాలు ఉంటే వాటిని కౌన్సిలింగ్ లో బయట పెట్టడం ద్వారా భాగస్వామి తోడు, భరోసాను పెళ్లికి ముందే స్పష్టం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తరువాత కొన్ని భయాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత, వైవాహిక జీవితంలో సంతోషం సాధ్యమవుతుంది.
*రూపశ్రీ.