తుస్సుమన్న స్టీఫెన్‌సన్ వాంగ్మూలం

 

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరికించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ మొన్న తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఏదేదో సంచలనాలు జరుగుతాయని చాలామంది భావించారు. అయితే ఆయన ఇచ్చిన వాంగ్మూలానికి అంత సీన్ లేదని, ఇప్పటి వరకు ఉత్కంఠను తుస్సుమనిపించేలా ఆయన వాంగ్మూలం వుందని తెలుస్తోంది. చంద్రబాబు మాట్లాడినట్టుగా ప్రచారంలో వున్న టేపులకు, స్టీఫెన్‌సన్ చెప్పిన వాంగ్మూలానికి పొంతన కుదరడం లేదని సమాచారం.

స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ప్రకారం తనను మత్తయ్య, సెబాస్టియన్ కలిశారట. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయకుండా విదేశాలకు వెళ్ళిపోవాలని సూచించారట. తాను ఏసీబీకి ఈ విషయాన్ని ఫిర్యాదు చేయడంతో వాళ్ళు తన ఇంట్లో వీడియో తీయడానికి ఐఫోన్ అమర్చారట. అప్పుడు రేవంత్ రెడ్డి అక్కడకి వచ్చారట. ఆ తర్వాత చంద్రబాబుతో  తనను మాట్లాడిస్తానని చెప్పిన సెబాస్టియన్ అక్కడి నుంచే ప్రయత్నిస్తే చంద్రబాబు బిజీగా వున్నారట. అదేరోజు సాయంత్రం సెబాస్టియన్ తనకు ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడించాడట. మీరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి మీకు నేను అండగా వుంటానని చంద్రబాబు అన్నారట. ఐదుకోట్లు ఇస్తానని హామీ ఇచ్చారట. అయితే ఇక్కడే అసలు తిరకాసు వుంది. చంద్రబాబు మాట్లాడినట్టు చెబుతున్న ఆడియోలో డబ్బు ప్రస్తావనే లేదు. స్టీఫెన్‌సన్ మాత్రం చంద్రబాబు ఐదుకోట్లు ఇస్తానని హామీ ఇచ్చారని  తన వాంగ్మూలంలో చెప్పారు. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం తుస్సుమనడానికి ఈ ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి అయితే స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో వి.రాఘవేంద్రరెడ్డి అని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ చేసి రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేయడమే కోర్టు ముందు నిలబడదని న్యాయ నిపుణులు భావిస్తున్న ఈ తరుణంలో స్టీఫెన్‌సన్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును మరింత నీరుగార్చేలా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.