కిరణ్ కు కితాబులిస్తున్న గల్లా
posted on Apr 5, 2012 7:51AM
మంత్రి గల్లా అరుణకుమారి తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై ఆమె రుసరుసలాడేవారు. అయితే ఆమె కొడుకు గల్లా జయదేవ్ కు తిరుపతి కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకునే వ్యూహంలో భాగంగా ఆమె ఇప్పుడు తన స్వరాన్ని మార్చారు. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చాలా సౌమ్యుడని, పరిపాలనా దక్షుడని ఆమె సర్టిఫికెట్లు ఇస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పరిచయం అయిన నాటినుంచి ఆయన ఎవరితోనూ పరుషంగా మాట్లాడినట్లు తాను చూడలేదని, వినలేదని, అలాంటి వ్యక్తి దౌర్జన్యాలు చేస్తారని కాంగ్రెస్ లో కొందరు నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తే పోటీచేస్తాడని, ఇవ్వకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. టిక్కెట్ విషయమై కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే గల్లా అరుణకుమారి ఆయన్ను పొగడ్తలతో ముంచేస్తున్నట్లు కార్యకర్తలు అంటున్నారు.