శ్రీజ భర్త శిరీష్ కు ప్రత్యామ్నాయం లేదు

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూతురు శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ కోర్టు ముందు లొంగిపోతాడా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అతనికి అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ముందస్తు బెయిల్ కోసం శిరీష్ భరద్వాజ్ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడమే కాకుండా సంబంధిత కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కట్నం వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నజి.ఆర్‌.శిరీష్‌ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలూ కోరుకుంటున్న దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని శిరీష్‌ న్యాయవాది పలుమార్లు చేసిన అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించలేదు. చట్టం ప్రకారం సంబంధిత న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు ముందు శిరీష్‌ లొంగిపోవటానికి ఇచ్చిన గడువును పొడిగించాలన్న విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. 'దానివల్ల వ్యవస్థపై అవాంఛనీయమైన ఒత్తిడి పడుతుంది. మీ దగ్గర డబ్బులున్నంత మాత్రాన మీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరగవు' అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. వరకట్న నిషేధ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ శిరీష్‌పై ఆరోపణలు దాఖలు చేశారని న్యాయవాది పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. 'వరకట్న నిషేధ చట్టం దుర్వినియోగం కావటం అన్నది పార్లమెంటు పరిధిలోని అంశం. దీనికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలు పెండింగులో ఉన్నాయి. పార్లమెంటుకు సమయం ఉన్నప్పుడు వీటిని పరిశీలించాలి' అని సూచించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu