తిరుమల ప్రక్షాళన.. తగ్గేదేలే.. తిరుమలలో పారిశుద్ధ్యం మెరుగునకు టెక్నాలజీ
posted on Apr 7, 2025 10:26AM

తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టగానే తొట్ట తొలిగా తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించింది. వైసీపీ హయాంలో తిరుమల పారిశుద్ధ్యం సహా ప్రతి విషయంలోనూ అస్తవ్యస్థంగా తయారైంది. అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం నుంచీ, తిరుమల ప్రసాదంలో కల్తీ వరకూ నానా రకాలుగా భ్రష్టుపట్టించారు. దీంతో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టగానే తిరుమల పవిత్రతను కాపాడటంపై దృష్టి సారించింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమలలో పర్యటించిన చంద్రబాబు ఆ సందర్భంగా తిరుమల ప్రక్షాళన తొలి ప్రాథాన్యత అని చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే తిరుమల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారు. కొండపై హోటళ్లలో పారిశుద్ధ్యం, తినుబండారాలలో నాణ్యత పెంపు నుంచి మొదలు పెట్టి.. వరుసగా తిరుమలలో పవిత్రత పెంచే విధంగా వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా తిరుమల కొండపై వసతి గృహాలు, కాటేజీలలో శుభ్రద పెంపు, ఫిర్యాదుల పరిశీలన, గదుల కేటాయింపు తదితర విషయాలపై టీటీడీ దృష్టి సారించింది. టీటీడీ ఈవో శ్యామలరావు ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులు టీటీడీ వసతి గృహాలను ఖాళీ చేసిన ఎంత సమయం తరువాత ఆ గదులను ఇతరులకు కేటాయిస్తున్నారు. గదులలో శుభ్రత, భక్తుల ఫిర్యాదులు వంటి సమాచారం వెంటనే తెలిసేలా యాప్ రూపొందించాలని ఆదేశించారు. గదుల కేటాయింపులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.
ప్రధానంగా తిరుమలలో భక్తులకు శీఘ్రదర్శనం, గదుల కేటాయింపు, శుభ్రత తదితర అంశాలపై ఇటీవల అధికారులతో చర్చించారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలనీ, లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద జాప్యం లేకుండా లడ్డూల పంపిణీ జరగాలన్నారు.