భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?
posted on Jan 6, 2026 4:09PM
.webp)
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు.
భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.
సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.