అమెరికా సుంకాల నుంచి ఆక్వారంగాన్ని రక్షించండి.. కేంద్ర మంత్రి పీయూష్ కు చంద్రబాబు లేఖ
posted on Apr 7, 2025 10:54AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందిస్తారు. ఆ నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెడతారు. ఆ నష్టాన్ని నివారించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తారు. అందుకు తాజా ఉదాహరణగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల పెంచిన సుంకాల కారణంగా అక్వారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించారు.
వెంటనే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న అక్వా రంగానికి అండగా నిలవాలని ఆ లేఖలో కోరారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి అక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జీడీపీలో అక్వారంగం కీలకమనీ, అందుకే ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు పీయూష్ గోయెల్ కు రాసిన లేఖలో కోరారు.
భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై ట్రంప్ తాజాగా 27 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే చంద్రబాబు తన లేఖలో ప్రస్తావిస్తూ.. 2023్ర2034 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి కాగా, అందులో 92 శాతం వరకూ రొయ్యలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకం కారణంగా అక్వారంగం దారుణంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే భారత ఎగుమతిదారులు 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) భారాన్ని మోస్తున్నారు. ఇప్పుడు ఈ దిగుమతి సుంకం కూడా యాడ్ అవ్వడం అక్వా రైతులపై మోయలేని భారం వేయడమే అవుతుందనీ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని చంద్రబాబు పీయూష్ గోయెల్ ను కోరారు.