వీధికుక్కల దాడిలో బాలుడి మ‌ృతి.. గుంటూరులో విషాదం

వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఆదివారం ఓ వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. వీధికుక్కల నియంత్రణలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వీధికుక్కల స్వైర విహారంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదేని స్థానికులు విమర్శిస్తున్నారు. తాజా ఘటనలో ఆదివారం (ఏప్రిల్6) సాయంత్రం నాలుగు గంటల సమయంలో చర్చి నుంచి బయటకు వచ్చిన ఐజాక్ అనే బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఐజాక్ ఆస్పత్రిలో మరణించడంలో స్వర్ణ భారతి నగర్ లో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.  నాగరాజు, రాణిమెర్సి దంపతుల  మూడో సంతామైన ఐజాక్.. ఆదివారం తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్లాడు. మూత్ర విసర్జన కోసం చర్చి బయటకు వచ్చిన ఐజాక్ పై ఓ వీధికుక్క దాడి చేసింది.  బాలుడి మెడ పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లి వదిలేసింది. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన ఐజాక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.  

ఈ ఘటన అనంతరం ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఇలాంటి దారుణం మరెక్కడా, ఎవరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణం స్పెషల్ డ్రైవ్ చేపడతామని మునిసిపల్ అధికారులు అంటున్నారు. బాలుడి మృతి పట్ల మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.