ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీ కెరీర్ నాశనమే..

ప్రతిమనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలతో పాటు కెరీర్ గురించి కూడా శ్రద్ద పెడతాడు. నిజానికి బంధాలు అనుబంధాలు అనేవి కాలంతో పాటూ కొత్తగా కూడా పుడతాయి. కానీ కెరీర్ అనేది చాలా ముఖ్యం. ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చెయ్యకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చదువు..  ఉద్యోగం.. ఈ రెండూ జీవితంలో ఎంత బాగా బ్రతకగలం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఇవి రెండూ బాగుండాలన్నా ఆ తరువాత జీవితం సజావుగా సాగాలన్నా జీవితంలో నమ్మకమైన మనుషులతో స్నేహం అవసరం. ఎందుకంటే జీవితంలో అన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో ఆచార్య చాణక్యుడు  నొక్కి చెప్పాడు. చాణక్యనీతిలో ఎవరిని నమ్మకూడదని చెప్పాడంటే..

ఆయుధాలు ఉపయోగించే వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. కత్తులు, పిస్టల్, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నవారు ఎక్కువ కోపం స్వభావం కలిగినవారై ఉంటారు. వీరికి కోపం వస్తే కొన్నిసార్లు ముందు వెనుక ఆలోచించకుండా ప్రమాదం తలపెడతారు. అందుకే ఆయుధాలు ఉన్నవారితో దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.

బలవంతులతో స్నేహం ఎప్పటికైనా ముప్పేనని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే బలవంతులు తమ స్వార్థం కోసం మనుషుల్ని ఉపయోగించుకుంటారు. అది పెద్ద తప్పేం కాదనే వాదనలో ఉంటారు. వారి కారణంగా జీవితంలో ముఖ్యమైన కాలాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. బలవంతులు అంటే డబ్బు మదం కలిగినవారు.

చెడు అలవాట్లున్న ఆడవారిని నమ్మడం కూడా ఇబ్బందులలో అడుగేసినట్టేనట. తమ సంతోషం కోసం, సుఖాల కోసం, అవసరాల కోసం భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసే మహిళలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనిషిలో ఎలాంటి ఆలోచనలున్నాయో, వారు ఎప్పుడేం చేస్తారో తెలియనప్పుడు వారితో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి ఆడవాళ్లు బాగా నాటకీయంగా ఉంటారు.

హింస ప్రవృత్తి కలిగిన వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. హింసను చూసి ఆనందపడేవారు చివరికి మిమ్మల్ని కూడా హింసిస్తూ పైశాచికానందం పొందే అవకాశం లేకపోలేదు.

ఇతరుల మీద అసూయను, ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ కుళ్లుకునేవారితో స్నేహం కూడా మంచిది కాదు. అలాంటి వారు ఇతరులు ఎదిగితే చూడలేరు. స్నేహమనే పేరున్నా సరే.. మీరు ఎదిగినా కూడా ఓర్చుకోలేరు.

                                         *నిశ్శబ్ద.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News