శాంతికి మనమే సోపానాలు..

యుద్దం ఓ భయానక దృశ్యమైతే.. శాంతి ఓ స్వేచ్చా శ్వాస తరంగం అని చెప్పవచ్చు.  ఏ దేశం అయినా శాంతితో ఉన్నప్పుడే అది  అన్నివిధాలుగా అభివృద్ది సాధించగలుగుతుంది. ఆ దేశ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ శాంతి ఎక్కడా?  ప్రశాంతత ఎక్కడా?  ప్రపంచంలో చాలా దేశాలు, చాలా ప్రాంతాలు అశాంతితో, హింసాకాండలో మండిపోతున్నాయి. ఈ అశాంతిని తగ్గించి, హింసాకాండలు రూపుమారి ప్రజలకు భయరహిత జీవితాన్ని ప్రసాదించడానికి ప్రపంచమంతా శాంతి మార్గంలో ప్రయాణించే దిశగా కృషి చేయడానికి  ప్రతి యేడు సెప్టెంబర్ మూడవ మంగళవారాన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.  ఈ రోజు ప్రాముఖ్యత, దీని చరిత్ర గురించి తెలుసుకుని అందుకోసం సగటు పౌరులుగా పాటుపడటం ప్రతి ఒక్కరి ధర్మం.

1981లో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ మూడో మంగళవారాన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించింది. ఇది స్థాపించిన రెండు దశాబ్దాల తర్వాత 2001లోసెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా  ప్రకటించింది.   ప్రపంచవ్యాప్తంగా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడం ఆ రోజు ముఖ్య  ఉద్దేశ్యం. ఆనాడు ప్రారంభించబడిన ఈ శాంతి దినోత్సవాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.  వివిధ దేశాల మధ్య యుద్దాలు ఉన్నా వాటిని 24గంటలపాటు కాల్పుల విరమణ కూడా ఇందులో భాగంగా ఉంది.  చరిత్రలో, చాలా సమాజాలు ఎక్కువ సమయం శాంతితో జీయి. నిజానికి సాధారణ సమాజంలో నివసించే పౌరులకంటే యుద్దంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నవారికి  ప్రాణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ రూపొందించినప్పటి నుండి  ప్రభుత్వాలు ఇతరులపై బలవంతంగా ఎలాంటి  నియమాలు ఉపయోగించకూడదు.

ఒక ప్రాంతంలో వ్యక్తుల మధ్య గొడవ జరిగితే అది  వారినే కాకుండా ఆ ప్రాంత ప్రజలను అందరినీ ఇబ్బందికి గురిచేస్తుంది. అదే విధంగా రెండు దేశాల మధ్య లేదా పలు దేశాల మద్య ఏదైనా యుద్దం చోటు చేసుకుంటే అది  దేశంలో ఉన్న ప్రజలను అందిరనీ కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సాంకేతికత అభివృద్ది చెందిన నేటికాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంది. దీని నష్టం చాలా ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ అర్థం కావాలంటే శాంతి ప్రాముఖ్యత కేవలం దేశాల మధ్య ఉండే అధికారులకే కాదు, దేశంలో ఉండే ప్రతి పౌరుడికి అర్థం కావాలి. అప్పుడు సహజంగానే పౌరులు శాంతి మార్గంలో వెళతారు.

భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాన్నే అహింస, శాంతి మార్గంలో నడిపించిన జాతిపిత గాంధీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. యుద్దంలో కల్లోలం ద్వారా జరిగే ప్రాణ నష్టం కంటే శాంతి ద్వారా సాధించుకునే పోరాటం ఎక్కువ బలమైనదని గాంధీ నమ్మారు. మనిషి కోపం తెచ్చుకుని ఎదుటి వ్యక్తిని కొట్టడం సులువే.. కానీ ఓపికగా ఉండటం మాత్రం చాలా కష్టతరమైన విషయం.  అలాంటి ఓపిక గాంధీ గారు దేశ ప్రజలకు భోదించారు. ఆ మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే ప్రయత్నం చేశారు.  అహింస, శాంతి, మౌనం చాలా గొప్ప ఆయుధాలు. వీటి గురించి పిల్లలకు వివరించాలి. వీటి విలువ పిల్లలకు తెలిస్తే ఈ సమాజం గొప్పగా ఎదుగుతుంది. విలువలతో కూడీన పౌరులతో తులతూగుతుంది.

కోపాన్ని జయించాలి. ప్రతి విషయానికి కోపం చేసుకోవడం కంట్రోల్ చేసుకోవాలి. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అహింసను పాటించాలి. ఎవరినీ కొట్టడం, తిట్టడం, హింసించడం చేయకూడదు.  అందరినీ సమాన దృష్టితో చూడాలి. శాంతి అంటే కేవలం ఒక వ్యక్తి  వ్యక్తిత్వం మారడం కాదు. సమాజ స్వరూపాన్ని శాంతియుతంగా మార్చడం. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

                                        *నిశ్శబ్గ.


 

Related Segment News