షూటింగ్ జాతీయ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసు.. సస్పెన్షన్ వేటు

 

కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫరీదాబాద్ లోని ఓ హోటల్ గదిలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు జాతీయ స్థాయి షూటర్‌ అయిన 17 ఏళ్ల బాలిక ఆరోపించడంతో ఆయనపై ఈ వేటు పడింది. ఈ నేపథ్యంలో అంకుశ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. హోటల్ గదిలో జరిగిన సంఘటనల గురించి సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ఆటతీరు సమీక్షించాలనే సాకుతో ఫరీదాబాద్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని కోచ్ బెదిరించాడని తెలిపింది. హోటల్ నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిన దారుణం గురించి చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయస్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా షూటర్‌పై ఈ లైంగిక దాడి జరిగింది. అంకుశ్‌ భరద్వాజ్‌పై పోక్సోసహా పలు సెక్షన్ల కింద ఫరీదాబాద్ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణలను ధృవీకరించడానికి సంఘటన జరిగిన రోజు హోటల్‌లోని అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను వెంటనే భద్రపరిచి తమకు అందజేయాలని నిర్వాహకులను కోరామని పోలీసులు తెలిపారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించిన 13మంది జాతీయ షూటింగ్ కోచ్‌ల్లో అంకుశ్‌ ఒకరు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో విచారణ ముగిసేవరకూ అంకుశ్ భరద్వాజ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు.
  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu