జ‌గ‌న్ గ‌తం గుర్తుచేసుకో.. మ‌త రాజ‌కీయాలు చేసింది నువ్వుకాదా!

కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారంతో యావత్ ప్రపంచంలోని శ్రీవారి భక్తులు కలవరానికి గురవుతున్నారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం ఈ అంశంపై స్పందించి.. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. కల్తీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు.

లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతంలో ఈ ఆగ్రహం మరింత తీవ్రంగా వ్యక్తం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహ‌న్‌ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుసుకుంటే వైసీపీ నేతలకు నిద్రపట్టదనడంలో అతిశయోక్తి లేదు.

జగన్ రెడ్డి.. తిరుమలను ఉపయోగించుకున్న తీరు.. అవినీతి, అక్రమాలకు వాడుకున్న వైనం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో హిందువుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటున్నది. శుక్ర‌వారం(సెప్టెంబర్ 20) సాయంత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఇదంతా కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ‌మ‌ని, తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామినికూడా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కోసం వాడుకుంటున్నారని విమ‌ర్శ‌లు చేశారు. 
అయితే జ‌గ‌న్ గ‌తాన్ని గుర్తుచేసుకుంటే రాజ‌కీయాల‌ కోసం మ‌తాన్ని వాడుకున్న‌ది ఎవ‌ర‌న్న‌ది తెలుస్తుందంటూ నెటిజ‌న్లు కౌంట‌ర్ ఇస్తున్నారు. 

తిరుమ‌ల‌ను, హిందూ మ‌తాన్ని రాజ‌కీయంగా వాడుకున్న‌ది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ మ‌త విశ్వాసాల‌ను బ‌లంగా న‌మ్మే వ్య‌క్తి. ఆయ‌న హిందూ దేవాల‌యాల‌కు వెళ్ల‌డం చాలా అరుదు.   2009లో ఒక‌సారి జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్లారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు క్రిస్టియానిటి నుంచి హిందువుగా మ‌త మార్పిడి చేసుకున్న‌ట్లుగా త్రివేణి సంగ‌మంలో శార‌దాపీఠం స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మూడు సార్లు నీటిలో ముంచారు. ఇందంతా 2019 ఎన్నిక‌ల ముందు జ‌రిగిన తంతు.. ఈ వ్య‌వ‌హారం అంతా రాజ‌కీయ అవ‌స‌రాల‌ కోసం జ‌రిగింద‌నేది అంద‌రికి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. హిందువుల ఓట్లకోసం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇలా ప్ర‌వ‌ర్తించార‌నేది రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారిని ఎవ‌ర్ని అడిగి చెప్పేస్తారు.

వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ రెడ్డి హిందువుల విశ్వాసాల‌కు విలువ‌నిచ్చారా అంటే అదీ లేదు. ఎవ‌రైనా దేవుడికి వ‌స్త్రాల‌కు స‌మ‌ర్పించే స‌మ‌యంలో స‌తీస‌మేతంగా వెళ్తారు. ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య‌మంత్రి హోదాలో అలా పట్టువస్త్రాలు స‌మ‌ర్పించ‌డం సంప్ర‌దాయం. కానీ,   దేవాల‌యాల‌కు వెళ్లిన స‌మ‌యంలో జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఎప్పుడూ క‌నిపించ‌లేదు. పైగా.. తాడేప‌ల్లి ప్యాలెస్‌లోనే తిరుప‌తి త‌ర‌హాలో సెట్ వేసి వేంక‌టేశ్వ‌ర స్వామి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. త‌ద్వారా ..  మేము తిరుమ‌ల‌కు రాము.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామినే  మా ప్యాలెస్ కు తీసుకొచ్చామ‌న్న‌ట్లుగా  జ‌గ‌న్ ప్ర‌వ‌ర్తించారు.  

భార‌త‌దేశంలో ఎవ‌రి మ‌తాన్ని వారు గౌర‌వించుకుంటారు. అందులో ఎలాంటి త‌ప్పులేదు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌త మార్పిడి చేసుకోవ‌టానికి కార‌ణం ఏమిటి? అందులో రాజ‌కీయ అంశాలు ఏమీ లేవ‌ని కొద్దిసేపు అనుకుంటే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన  త‌రువాత ఏ ఒక్క హిందూ ఆల‌యాన్నైనా నిర్మించారా? మ‌ర‌మ్మ‌తులు చేశారా? ఆల‌యాల భూమలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా ప‌రిర‌క్షించారా? అంటే  లేదు అన్న సమాధానమే వస్తుంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో ప‌లు హిందూ ఆలయాలపై దాడులు జ‌రిగాయి. జగన్ హయాంలో  రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది. జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహస్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులను ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు హిందువులు పుణ్య‌క్షేత్రంగా భావించే తిరుమ‌ల‌లోనూ జ‌గ‌న్ హ‌యాంలో అనేక అప‌చారాలు చోటు చేసుకున్నాయి. ల‌డ్డూ నాణ్య‌త లేకపోవ‌టంతో అప్ప‌ట్లోనే భ‌క్తులు టీటీడీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లో ల‌డ్డూ నాణ్య‌త‌లేక‌పోవ‌టానికి ల‌డ్డూ త‌యారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉండ‌ట‌మేన‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది. 

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి హిందూ మ‌తంపై ఎలాంటి గౌర‌వం లేదు.. కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే దానిని వాడుకుంటున్నార‌న‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్లిన స‌మ‌యంలో అర్చ‌కులు ఆయ‌న‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో నెత్తిన అక్షింత‌లు వేశారు. జ‌గ‌న్ వెంట‌నే వాటిని త‌ల‌పై నుంచి తొల‌గించేశారు. హిందుత్వంపై గౌర‌వం ఉన్న‌వారు ఎవ‌రైనా అర్చ‌కులు దీవిస్తూ నెత్తిన వేసిన అక్షింత‌ల‌ను తొల‌గించ‌రు. చాలాసేపు త‌ల‌లో అలానే ఉంచుకుంటారు. కానీ, జ‌గ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో అర్చ‌కులు దీవిస్తూ త‌న నెత్తిన వేసిన అక్షింత‌ల‌ను వెంట‌నే తొల‌గించిన వీడియోలు  సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ హిందువులు. అయినా వారు ముస్లీం, క్రైస్త‌వుల మ‌తాల‌ను గౌర‌వంగా చూస్తారు. జ‌గ‌న్‌లా న‌టించ‌కుండా   ముస్లిం సంప్ర‌దాయాల‌ను,  క్రైస్త‌వులు సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ గౌర‌వంగా ఉంటారు. కానీ, జ‌గ‌న్ మాత్రం హిందువుల ఓట్ల కోసం హిందుత్వాన్ని రాజ‌కీయంగా వాడుకున్నారు. పైగా హిందువులపై ప్రేమ ఒల‌క‌బోస్తూనే హిందూ దేవాల‌యాల‌పై దాడులు.. తిరుమ‌ల‌లో ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తూ హిందువుల మ‌నోభావాల‌ను అధికారాన్ని అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ దెబ్బ‌తీశార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.