ముంబై నటి జెత్వానీ కేసు.. కుక్కల రిమాండ్ రిపోర్టులో సస్పెండైన ఐపీఎస్ అధికారుల పేర్లు

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తులో సోమవారం (సెప్టెంబర్ 23) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్  రిమాండ్ రిపోర్ట్‌లో  ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురినీ అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.  ఈ ముగ్గురినీ కూడా నిందితులుగా ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు కోర్టు అక్టోబర్ 4 వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 

ఈ కేసు వెలుగులోకి రాగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు రెండు రోజుల కిందట డెహ్రాడూన్ లో అరెస్టు  చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ ను పపోలీసులు ఈ తెల్లవారు జామున న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి కుక్కల విద్యాసాగర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.  

కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు విమానంలో ముంబై వెళ్లి మరీ కాదంబరి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చారు. అయితే ఆయన ఫిర్యాదుకు ఒక రోజు ముందే పోలీసు అధికారులు ముంబైకి విమానం టికెట్ బుక్ చేసుకోవడంతో  ఉద్దేశ పూర్వకంగానే జత్వానీని అరెస్టు చేసి వేధించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తేల్చుకున్నారు. వైసీపీ సర్కార్ పతనమై ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నటి కాదంబరి జత్వానీ  ఇబ్రహీం పట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ను నిందితుడిగా గుర్తించారు.

వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, పార్టీ అగ్రనేతల ప్రోద్బలంతోనే ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ అడ్డగోలుగా వ్యవహరించి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధించారని గుర్తించారు. ఇప్పటికే విశాల్ గున్ని తన మూడు పేజీల వాంగ్మూలంలో దాదాపుగా తనపై ఎవరెవరు ఒత్తిడి చేసిందీ పూసగుచ్చినట్లు వివరించారు.