టి ఆర్ ఎస్ లోకి నలుగురు టి కాంగ్రెస్ ఎంపిలు?
posted on Apr 5, 2012 6:47AM
ప్రత్యేక తెలంగాణా విషయంలో అధిష్టానాన్ని ఇరుకున పెడుతూ తీవ్ర వత్తిడి తెస్తున్న తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు త్వరలో పార్టీ నాయకత్వానికి పెద్ద ఝలక్ ఇవ్వబోతున్నారా? టి కాంగ్రెస్ లోని కొందరు ఎంపిల వ్యవహార శైలి, ప్రకటనల జోరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో తెలంగాణా వాదం మరోసారి ప్రస్ఫుటం కావడంతో తాము కూడా గులాబీ దండులో చేరకపోతే 2014లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో అనామకులుగా మిగిలిపోవలసివస్తుందని నలుగురు కాంగ్రెస్ ఎంపిలు భావిస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ ఎంపిలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్, సర్వే సత్యనారాయణ త్వరలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టి ఆర్ ఎస్ లో చేరే యోచనలో ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఈ నలుగురు ఇప్పటికే టి ఆర్ ఎస్ నేతలతో రహస్యంగా మంతనాలు జరిపినట్లు తెలిసింది. సీమాంధ్రుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇవ్వదన్న నిర్ణయానికి ఈ నలుగురు నేతలు వచ్చినట్లు తెలిసింది. అందుకే ఈ నలుగురు టి ఆర్ ఎస్ లో చెరి అవసరమైతే ఉప ఎన్నికలకు సిద్ధపడాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలిసింది. సెంటిమెంట్ కారణంగా ఉప ఎన్నికల్లో తమకే విజయం లభిస్తుందని, ఆ తరువాత జరిగే సాధారణ ఎన్నికల్లో కూడా టి ఆర్ ఎస్ తమకు టిక్కెట్లు ఇస్తే మరోసారి సునాయాసంగా గెలుపొందుతామని ఈ నలుగురు నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినా గెలవడం కష్టమనే భావనతో ఈ నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది.