గిల్టీగా ఫీలవుతున్న సిబిఐ లక్ష్మీనారాయణ?
posted on Apr 4, 2012 11:49AM
సంచలనాలకు మారుపేరైన సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వైఖరిలో ఇటీవల మార్పు కనిపిస్తున్నట్లు తెలిసింది. గతంలో లాగా ఆయన ఆత్మస్థైర్యంతో కనిపించడం లేదని, పై అధికారులు, రాజకీయ నాయకుల వైఖరి పట్ల కూడా ఆయన చాలా అసహనంగా ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా సిబిఐ విచారణలపై పలు విమర్శలు వస్తున్నాయి. జగన్ అనుకూల మీడియా, వార్తా పత్రిక సిబిఐ కి, తనకు వ్యతిరేకంగా అనేక వార్తలు ప్రచురిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉంటున్నారు. మరో వైపు జగన్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని జగన్ అభిమానుల హెచ్చరికతో ఆయన మరికొంత ఆందోళనకు గురవుతున్నారు. జగన్ మద్దతు దారులు దాడులు జరుపుతారేమోనన్న భయంతో ఆయనే స్వయంగా భద్రతా సిబ్బంది మధ్య గడపవలసి రావడం పట్ల గిల్టీగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నప్పుడల్లా రాష్ట్రంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద భద్రతా సిబ్బందిని నియమించాల్సి వస్తోంది. గతంతో సిబిఐ విచారణ సందర్భంగా ఇటువంటి పరిణామాలేమీ సంభవించలేదు. సిబిఐ అంటే నేరస్థులకు సింహస్వప్నం.... అయితే ఈ రోజు నిందితులకు, వారి వారి మద్దతు దారులకు సిబిఐ అధికారులు భయపడాల్సి వస్తోంది. గన్ మెన్లు లేకుండా వారు బైట తిరగలేని పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అని మాజీ ఐపిఎస్ అధికారి ఒకరు తెలుగువన్. కామ్ తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంజనీరింగ్ చదివిన లక్ష్మీనారాయణ గతంలో మహరాష్ట్రలో తనకు అప్పగించిన కేసులను సమర్ధవంతంగా పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నారు. గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆయన పేరు ప్రతిష్టలు మరింత పెరిగాయి. ఐఎఎస్ అధికారిని శ్రీలక్ష్మిని అరెస్ట్ చేయడం ద్వారా కర్తవ్య నిర్వహణలో చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడన్న పేరు పొందారు. అయితే జగన్ విషయానికి వచ్చేటప్పటికి ఆయన ప్రతి అడుగును జాగ్రత్తగా ఆలోచించి వేయాల్సి వస్తుంది. నిజానికి అక్రమాస్తుల కేసులో జగన్ ను అరెస్ట్ చేయాల్సి వస్తే ఆయనతో పాటు అనేక మంది అక్రమార్జన పరులను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించడం వల్ల కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించిందన్న విషయం లక్ష్మీనారాయణకు బాగా తెలుసు. సిబిఐ అనేది ఒక కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మారిందన్న విమర్శలు ఒకవైపు వస్తున్నాయి. మరోవైపు ఒక వేల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరిలో మార్పు వస్తే ఇప్పటి దాకా చేసిన దర్యాప్తు అంతా వృద్ధా కావడంతో పాటు తాను నవ్వుల పాలు కావాల్సి వస్తుందన్న భావనతో కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన తాజా సంఘటన కూడా లక్ష్మీనారాయణ కొంత కలవరానికి గురి చేసినట్లు తెలిసింది. దేశంలోని కీలక రాజకీయ నాయకుల్లో ఒకరైన ములాయం సింగ్ యాదవ్ వారం రోజుల క్రితం కేంద్రంలో నెంబర్ టు స్థానంలో ఉన్న ప్రణబ్ కుమార్ ముఖర్జీని కలిసి జగన్ ను అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుందని హెచ్చరించినట్లు తెలిసింది.
.jpg)
లక్ష్మీనారాయణకు సిబిఐ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం అనుమానమే. ఒకవేళ అది జరగడంతో పాటు జగన్ అనుకూల పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే తనకు ఇబ్బందులు తప్పవన్న భయంతోనూ లక్ష్మీనారాయణ ఉన్నట్లు తెలిసింది. అనవసరంగా ఈ రాజకీయాలకు బలవ్వడం కన్నా తెలివిగా వ్యవహరించాలని ఆయన యోచిస్తున్నారు. అందుకే జగన్ ను అరెస్ట్ చేయాల్సి వస్తే నేరుగా సిబిఐ ద్వారా అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాల ద్వారా అరెస్ట్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. రాజకీయ నాయకుల మాటలు విని వోవర్ యాక్షన్ చేస్తే ఇబ్బందులు తప్పవని చివరకు వారు చేతులు కలుపుకొని అధికారులను బలి పశువులను చేస్తారని మద్యం సిండికేట్ వ్యవహారంలో ఇప్పటికే తేలింది. ముఖ్యమంత్రి ఆదేశాలపై మద్యం సిండికేట్లపై దాడులు జరిపిన ఉన్నతాధికారిని రాత్రికి రాత్రే బదిలీ చేశారు. ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్న లక్ష్మీనారాయణ భవిష్యత్ లో తనకు ఇబ్బందులు కలుగకుండా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.