సతీష్ చంద్రకే 'సౌత్ బ్లాక్' ఆశీస్సులు

* ఏపీ తదుపరి చీఫ్ సెక్రెటరీ దాదాపుగా ఆయనే 
* నెలాఖరుకు రిటైర్ అవుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం 
* వచ్చే నెలాఖరుకు నీలం సాహ్నీ పదవీ విరమణ  

ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర పేరు చీఫ్ సెక్రెటరీ పదవికి దాదాపుగా ఖరారైంది. ఉత్తరాదిలో సీనియర్ బ్యూరోక్రాట్లతో, ఢిల్లీ సౌత్ బ్లాక్ తో సన్నిహిత సంబంధాలున్న సతీష్ చంద్ర, అధికారం లో ఏ పార్టీ ఉన్నా సరే, చీఫ్ మినిష్టర్ కు దగ్గరగా ఉండడం గడిచిన పదేళ్లలో మనం చూస్తూ వస్తున్న విషయమే. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘నీలం సహానీ’ మే నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతుండడంతో, కొత్త సిఎస్‌గా  రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐఎఎస్‌ అధికారుల్లో అందరికన్నా సీనియర్‌ ‘ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం’. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలాఖరుకు  ముగియనుంది. ‘నీలం సహానీ’ కన్నా ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో విభేదాలు రావడంతో ఆయనను పదవి నుంచి తప్పించి, బాపట్ల హెచ్ ఆర్ డీ కి డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అప్పటి నుంచి ఆయన సెలవులో ఉన్నారు. ఆయన తరువాత సీనియర్లు అయిన ‘ప్రీతీసూడాన్‌,ఎ.పి.సహానీ, డాక్టర్‌ సమీర్‌శర్మ,ఆర్‌.సుబ్రహ్మణ్యం, అభయత్రిపాఠీలు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వీరిలో ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో తరువాత సీనియర్లుగా ఉన్న ‘సతీష్‌చంద్ర,జె.ఎస్సీ ప్రసాద్‌, నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ఆదిత్యనాథ్‌దాస్‌’లు రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఈ పదవి దక్కుతుందా..? దక్కితే ఎవరికి దక్కుతుందనే దానిపై పలు రకాలైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 

వీరందరిలోనూ  ‘సతీష్‌చంద్ర’ మాత్రమే  సీనియర్‌.  ఆయనకు, ఇంకా ఏడాది ఎనిమిది నెలల సర్వీసు ఉంది. ఆయనను కనుక ‘సిఎస్‌’గా నియమించుకుంటే దాదాపు రెండు సంవత్సరా పాటు ఆ పదవిలో కొనసాగుతారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆయన ‘చంద్రబాబు’ కార్యాల‌యంలో పనిచేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఇటీవల‌ వరకు ఆయనకు వైకాపా ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అయితే రెండు మాసాల‌ క్రితం ఆయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్యాశాఖను అప్పగించి ప్రయారిటీ ఇచ్చింది. విద్యాశాఖను ప్రభుత్వం అప్పచెప్పిన తరువాత ‘సతీష్‌చంద్ర’ అధికారపార్టీ పెద్దల‌కు దగ్గరయ్యారని అంటున్నారు. గతంలో వారితో ఉన్న స్పర్థల‌ను ఆయన తొల‌గించుకున్నారని, దీంతో ఆయనను సిఎస్‌గా నియమిస్తారనే భావన అధికారవర్గాల్లో, మీడియా వర్గాల్లో నెల‌కొని ఉంది. ఎల్ వీ నిష్క్రమణ తర్వాత, ప్రభుత్వం లో తన ప్రాధాన్యాన్ని గణనీయంగా పెంచుకున్న సతీష్ చంద్ర, ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లోని పెద్దల ద్వారా నడిపిస్తున్న బలమైన లాబీ కారణంగా ఆయన పేరే తదుపరి చీఫ్ సెక్రెటరీ గా ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సచివాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.