అంత్యక్రియల తర్వాతే బాబా వారసుడి ఎంపిక?

పుట్టపర్తి: : పుట్టపర్తి సత్యసాయి పరమపదించిన తర్వాత ఆయన వారసుడెవరన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. సత్యసాయి బాబా మృతితో దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆధ్యాత్మిక ఆస్తుల వ్యవహారం, కార్యకలాపాలపై ప్రస్తుతం అయోమయం నెలకొంది. దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని సత్యసాయి ట్రస్టు వెల్లడించనుంది. బుధవారం ఉదయం బాబా అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆ తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కీలక భేటీ జరుగనుంది.  ఆధ్యాత్మిక కేంద్రం కార్యకలాపాలను ఎలా కొనసాగించాలి, ఎవరు నేతృత్వం వహించాలి అనే అంశాలపై ఈ ట్రస్ట్ చర్చించనుంది. బుధవారం జరిగే సమావేశంలో ట్రస్టు సభ్యులతో పాటు సత్యసాయి బాబా కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఇరు పక్షాల మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత చేకూరింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ను ట్రస్టులోకి తీసుకోవాలా, వద్దా అనే విషయంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సత్యజిత్ పట్ల కొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పలువురు పలు రకాలుగా విమర్శలు సైతం గుప్పించారు. అందువల్ల ఈయనకు ట్రస్టులో సభ్యత్వం కల్పించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇకపోతే.. సాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ట్రస్ట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పాత్ర భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది కూడా ఈ సమావేశంలో తేలే అవకాశాలు ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu