జాతీయ ఐక్యతా దినోత్సవం* ఉక్కుమనిషి ఉక్కు సంకల్పమే నేటి ఐక్య భారతం..
posted on Oct 31, 2023 11:51AM
ప్రపంచదేశాలలో ఎంతో గొప్పదైన భారతదేశం ఒకప్పుడు బ్రిటీషర్ల చేతుల్లో నలిగింది. భారత ప్రజలు తెల్లదొరల కింద బానిసలుగా జీవితాన్ని గడిపారు. ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తిని కలిగించడానికి,దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది వీరులు దేశం కోసం పాటుపడ్డారు. వీరిలో భారతీయులు ఉక్కు మనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖులు. 565 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన రాచరిక రాష్ట్రాలు, బ్రిటీష్ కాలం నాటి వలసరాజ్యాల ప్రావిన్సుల నుండి భారతదేశాన్ని ఐక్యంగా రూపొందించడంలో ఈయన కృషి చేశారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా, భారతదేశ మొదటి హోం మినిన్టర్ గా పనిచేసిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి యేటా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశం ఏకం కవడానికి ఆయన చేసిన ఉక్కు సంకల్పం కారణంగానే ఆయనకు ఉక్కుమనిషి అనే బిరుదు వచ్చిందని కూడా అంటారు. అసలు ఈ జాతీయ ఐక్యతా దినోత్సవం చరిత్ర ఏమిటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పం దేశానికి ఎలా ఉపయోగపడింది? ఈయన జీవితం ఏంటి? మొదలైన విషయాలు పూర్తీగా తెలుసుకుంటే..
భారతదేశపు ఉక్కు మనిషి వల్లభాయ్ ఝవేర్‌భాయ్ పటేల్ అక్టోబర్ 31, 1875న జన్మించాడు. ఈయనను సర్దార్ పటేల్ అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర్యం తర్వాత బ్రిటిష్ వారు వైదొలిగినప్పుడు భారతదేశాన్ని ఒక తాటిమీద నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన నాయకులలో ఈయన అగ్రగణ్యుడు. దేశాన్ని విభజించి పాలించడమనే వ్యూహంలో భాగంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో, సర్దార్ పటేల్ భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.
సర్దార్ పటేల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. భారతదేశం , పాకిస్తాన్ విభజన తర్వాత స్వతంత్ర ప్రావిన్సులను ఏకీకృత భారతదేశంలోకి చేర్చడంలో ఆయన గణనీయమైన పాత్ర పోషించాడు. భారతదేశ రాజకీయ ఏకీకరణ,1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో హోం మంత్రిగా కూడా పనిచేశాడు.
జాతీయ ఐక్యతా దినోత్సవం..
2014లో రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జాతీయ ఐక్యతా దినోత్సవం అధికారిక ప్రకటనను దేశ హోం మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. జాతీయ ఐక్యత దినోత్సవం "మన దేశ ఐక్యత, సమగ్రత ,భద్రతకు అసలైన అర్థం దేశానికి ఏర్పడే బెదిరింపులను తట్టుకోవడానికి దేశానికి ఉన్న సహజమైన బలాన్ని, స్థితిస్థాపకతను తిరిగి సంపాదించుకోవడానికి, దాన్ని ధృవీకరించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా దేశ బలం అందరికీ చాటి చెప్పినట్టు అవుతుంది. ఈ విషయాన్ని చాటి చెప్పడమే జాతీయ ఐక్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
భారతదేశం కోసం ఆయన చేసిన కృషికి గుర్తుగా సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజును జరుపుకోవడానికి ముందు 'యూనిఫైయర్ ఆఫ్ ఇండియా' స్టాట్యూ ఆఫ్ యూనిటీతో సర్దార్ వల్లబాయ్ పటేల్ ను దేశం మొత్తం సత్కరించుకుంది. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. సుమారు 597 అడుగుల ఎత్తులో సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఆయన్ను దేశం గౌరవించుకుంది. అక్టోబర్ 31, 2018న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అక్టోబర్ 31, 2019న, భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి అవగాహన కల్పించడానికి 'రన్ ఫర్ యూనిటీ' అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 144వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం లో ప్రారంభమైన రన్‌లో వేలాది మంది పాల్గొన్నారు. ఇండియా గేట్ సి-హెక్సాగన్-షాజహాన్ రోడ్ వద్ద దాదాపు ఒక మైలు దూరం పరుగు సాగింది. హిందువులూ, ముస్లింలు ఒకే దేశంలో నివసించాలని సంకల్పించి ఆ దిశగా పోరాటం చేసి దాన్ని సాధించిన ఉక్కు మనిషిగా సర్థార్ వల్లబాయ్ పటేల్ యావత్ దేశ ప్రజలకు పూజ్యునీయుడు.
పాఠశాలల్లో, కళాశాలల్లో సర్దార్ పటేల్ గురించి పిల్లలకు వివరించి చెప్పడం. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం గురించి పిల్లలకు చెప్పి వారిలో చైతన్యం కలిగించడం సర్దార్ పటేల్ వ్యక్తిత్వం ద్వారా పిల్లలు మంచి విషయాలు నేర్చుకునేలా పిల్లలను గైడ్ చేయడం ద్వారా పిల్లలలో మంచి క్రమశిక్షణ, గొప్పవిలువలు అలవడతాయి.
*నిశ్శబ్ద.