అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి.. జగన్ స్కెచ్చేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కుపోయారు. అలా ఇరుక్కుపోయారనడానికి ప్రత్యక్ష నిదర్శనమే వైసీపీఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో వారసుడు  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోవడమే. శతర్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక ఏపీ సీఎం జగన్ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అప్రూవర్ గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. అంతే కాదు.. ఆయనకు భద్రత కల్పించేందుకు వై కేటగరి సెక్యూరిటీని కూడా కల్పించింది.

ఈ పరిణామాలన్నీ ఏపీ సీఎం   జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన  అనంతరం చోటు చేసుకున్నాయి.   శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో   కవిత  పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయినట్లేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. అందరూ కలిసి స్కాం చేసినందున.. అసలు స్కాం ఎలా జరిగింది.. నగదు వ్యవహారాలు ఎలా జరిగాయో వీరు బయటపెడారు. వీరు అప్రూవర్ గా మారినందున వీరికి పరిమిత శిక్షలు అమలు చేస్తారు. కానీ అసలు కేజ్రీవాల్, కవిత మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కేసులో గతంలోనే ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు.   

లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌‌‌‌లో శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కింగ్‌‌‌‌పిన్‌‌‌‌గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌, సమీర్ మహేంద్రుతో కలిసి రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్‌‌‌‌ కంపెనీలు ఢిల్లీలో రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితుడైన సమీర్ మహేంద్రు కంపెనీ ఇండో స్పిరిట్ లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన   చార్జిషీట్లలో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి.

డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలను కూడా ఈడీ  ఈ చార్జిషీట్ లో పాటుగా కోర్టుకు సమర్పించింది.   ఇప్పటి వరకూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో   పొందు పరిచిన అంశాల మేరకు.. కవిత కు సంబంధించిన అంశాలే ప్రముఖంగా ఉన్నాయని అంటున్నారు. కవిత హైదరాబాద్ లో కొన్న బూములు.. ఏవి, ఎక్కడ కొన్నారు.. యిందుకు సొమ్ములు ఏ విధంగా చెల్లించారు వంటి వివరాలను పొందుపరిచారు.  వీటిని కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో  ఉన్న సమాచారం ఆధారంగానే కాకుండా, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఆమె బినామీగా చెబుతున్న పిళ్లై లు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈడీ అధికారులు ఈ చార్జిషీట్ లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యమైందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు.

అలాగే కవిత బినామీగా చెబుతున్న రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారుతున్నట్లు ప్రకటించి మళ్లీ ఉపసంహరించుకున్నారు. ఇక బుచ్చిబాబు అయితే కవిత ఆర్థిక వ్యవహారాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు.. ముడుపులు.. పెట్టుబడులు భూముల గురించి మొత్తం  ఈడీ అధికారుల ముందు వెల్లడించినట్లుగా అ చార్జిషీట్ లో తేటతెల్లం అయ్యిందని అంటున్నారు.  ఒక ఆడిటర్ తన క్లయింట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చెప్పారంటే.. ఆషామాషీగా ఉండదని, తాను చెప్పిన విషయాలను సంబంధించిన ఆధారాలు ఉంటేనే ఆయన చెబుతారని అటున్నారు.  ఇక కవిత  బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై  యిప్పటికే అప్రూవర్ గా మారారు. తరువాత కోర్టులో కాదని పేర్కొన్నప్పటికీ అప్పటికే ఆయన వివరాలన్నీ వెల్లడించేశారనీ, ఆయన చెప్పిన అంశాల ఆధారంగానే ఈడీ  కేసును పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ కవిత చుట్టూ ఉచ్చు బిగించిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కాలు ఫ్రాక్చర్ అయ్యిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  గత ఇరవై రోజులుగా  ఎక్కడా కనిపించడంలేదు. ఈ మధ్యలో  ఒక సారి మాత్రం సుప్రీంకోర్టులో తాన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని  మెన్షన్ చేయించారు.  అవన్నీ పక్కన పెడితే  ఇప్పుడు  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక అరబిందో కుటుంబంతో దగ్గర బంధుత్వం ఉన్నావిజయసాయిరెడ్డి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడికి స్వయానా సోదరుడు. దీంతో శరత్ చంద్రరెడ్డి అప్రూవర్ గా మారడంతో  జగన్.. తాను ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కుమార్తెను చిక్కుల్లో పడేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కాగా ఈ పరిణామం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చకు కారణమయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.