తెలంగాణ కొత్త పార్టీకి నూకలు చెల్లినట్టేనా? 

ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు పెద్దలు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన  బీఆర్ఎస్ అనే రాజకీయపార్టీ  చివరకు తెలంగాణ అనే పేరును తొలగించడం పట్ల తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పొంగులేటి, జూపల్లి పెట్టబోయే కొత్త పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రిజిస్టర్ కూడా జరిగినట్లు సమాచారం. 
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అంకురార్పణ జరగనుందని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. కేసీఆర్ తో విభేధించిన వ్యక్తులను, పార్టీలను బతికి బట్ట కట్టనిచ్చే పరిస్థితి లేదని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. బిఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన టైగర్ నరేంద్రను, తల్లి తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు విజయశాంతిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టిన కేసీఆర్ పొంగులేటి, జూపల్లి పెట్టే కొత్త రాజకీయ పార్టీని మొగ్గలోనే తెంపివేయాలని  ప్లాన్ చేస్తున్నారు  . కొత్తగా పెట్టబోయే జనం తెలంగాణను రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నే నిలుపుదల చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిఆర్ఎస్ తో విభేధించి భారతీయ జనతాపార్టీలో చేరిన ఈటెలను కేసీఆర్ మూడు చెరువుల నీరు తాగించారు. ఈటెలపై, ఆయన భార్యపై క్రిమినల్ కేసులను పెట్టించారు. జాతీయ పార్టీలో చేరి అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరిన ఈటెలనే  కేసీఆర్ వదల లేదు. అమిత్ షా అండదండలున్న ఈటెలపై బిఆర్ఎస్ వెనక్కి తగ్గింది. కానీ  కొత్తగా వచ్చే జనం తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నేతలు జనం తెలంగాణలో చేరే అవకాశం లేదు. పసి కూన పార్టీలో చేరి నాయకులు ఇబ్బందులకు గురి కారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించే నేతలు కొత్త ప్రాంతీయ పార్టీలో చేరే అవకాశం లేదు. బీఆర్ఎస్ నుంచి విభేధించి బయటకొచ్చిన పొంగులేటి , జూపల్లిలు సైతం కొత్త రాజకీయ పార్టీ అంశాన్ని విరమించుకోనున్నారు. ఎందుకంటే వారికి కాంగ్రెస్, బిజెపి అధినాయకత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. ఖమ్మంజిల్లాలో తిరుగులేని నాయకుడు పొంగులేటి. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి ఖమ్మంలో బలహీనంగా ఉంది. ఓడిపోయే పార్టీలో ఏ నేత చేరే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జూపల్లి తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి. 
చేరికల కమిటీ  చైర్మన్ అయిన ఈటెలను జనం తెలంగాణ పార్టీలో చేరాలని కోరిన పొంగులేటి, జూపల్లిల కొత్త పార్టీకి మనుగడలేదని ఈటెల వారికి నచ్చ జెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కొత్త పార్టీకి  నూకలు చెల్లినట్టు కనబడుతోంది.