మహేష్ బాబు ఇంటర్వ్యూ బై హీరోయిన్ సమంత
posted on Dec 1, 2014 6:29AM
హూద్ హూద్ తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ‘మేము సైతం’ అంటూ ఏకధాటిగా 12గంటల పాటు అనేక వినోద, క్రీడా కార్యక్రమాలు నిర్వహించింది. యావత్ చిత్రసీమ అందులో పాల్గొనేందుకు స్వచ్చందంగా ముందుకు కదిలి వచ్చింది. ఆ కార్యక్రమాలలో భాగంగా టాలీవుడ్ అందాల తార సమంత ప్రిన్స్ మహేష్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లను ఇంటర్వ్యూ చేసారు.
ఆమె అడిగిన ఒక ప్రశ్నకు త్రివిక్రమ్ బదులిస్తూ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా నిరాడంబరంగా ఉంటారు. వారిద్దరూ కూడా చాలా అల్ప సంతోషులు. వారికి లగ్సరీ కార్లు, విలాసవంతమయిన బంగ్లాలు కావాలనుకోరు. వేసుకోవడానికి ఓ రెండు జతలబట్టలు, తల దాచుకొనేందుకు ఒక చిన్న ఇల్లు, చదువుకొనేందుకు బ్యాగులో ఓ రెండు పుస్తకాలు ఉంటే చాలు వారికి మరేమీ అవసరం ఉండదు. ఒకసారి కధ విని ఒకే చెప్పేసిన తరువాత ఇక షూటింగులో ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నిశబ్దంగా చెప్పిన పని చేసుకుపోతారు. వారిలో ఆ గొప్ప లక్షణాలే నన్ను వారికి దగ్గరగా చేర్చాయని భావిస్తున్నాను,” అని అన్నారు.
అప్పుడు మహేష్ బాబు మాట్లాడుతూ, “ఒకసారి దర్శకుడు చెప్పిన కధ విని ఒప్పుకొన్న తరువాత మధ్యలో మళ్ళీ సందేహాలు లేవనెత్తడం మంచిపద్ధతి కాదని నా అభిప్రాయం. దర్శకుడికి తన కధను సినిమాగా ఎలా మలచాలో అందరికంటే బాగా తెలుసుటుంది కనుక ఆయన చెప్పినట్లు ఫాలో అయిపోవడమే మంచిది. అలాగని సినిమా ఫెయిల్ అయితే ఆయన ఒక్కడినే తప్పు పట్టడం కూడా సరికాదు. ఎందుకంటే సినిమా అనేది అందరి సమిష్టి కృషి కారణంగా తయారయినది,” అని అన్నారు.
సమంత అడిగిన ఒక ప్రశ్నకు మహేష్ బదులిస్తూ, “నేను రీమేక్ సినిమాలలో నటించడానికి ఎందుకు ఇష్టపడను అంటే, సినీ నిర్మాణం అనేది ఒక సృజనాత్మక రంగం. అందులో నిత్యం ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నం అవసరమని నేను భావిస్తాను. అప్పటికే రిలీజ్ అయ్యి కొన్ని లక్షలమంది చూసేసిన సినిమాను మళ్ళీ తీయడం అందులో నేను ఎవరినో ఊహించుకొంటూ నటించడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే నేను రీమేక్ సినిమాలలో నటించడానికి ఇష్టపడను,” అని అన్నారు.
త్రివిక్రమ్ అడిగిన ప్రశ్నకు సమంతా జవాబిస్తూ, “నేను దక్షిణాదిన అందరో అగ్ర హీరోలతో కలిసి పనిచేసాను. బేసిక్ గా కొన్ని గొప్ప లక్షణాలు అందరిలో ఒక్కలాగే ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నిరాడంబరంగా ఉండటం, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కష్టపడి పనిచేయడం, చేసేపని పట్ల పూర్తి శ్రద్ద, ఎటువంటి బేషజాలు లేకుండా సెట్స్ లో అందరితో కలిసిపోవడం వంటివన్నీ వారిని ఈ స్థాయికి తీసుకువచ్చి నిలిపాయని నేను భావిస్తున్నాను. వారెవరిలో కూడా తాము ఒక పెద్ద హీరో అనే ఫీలింగ్ లేకుండా చాలా నిరాడంబరంగా, దర్శకుడు చెప్పినట్లుగా క్రమశిక్షణతో పనిచేయడమే వారి విజయ రహస్యమని నాకు అర్ధమయింది. “ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావించి అందులో నుండి కొత్త విషయాలు నేర్చుకొంటూ ఉండాలి” అని హీరో సూర్యా చెప్పిన సలహా నేటికీ నా బుర్రలో అలా మెదులుతూ నన్ను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేట్లు చేస్తుంటుంది,” అని అన్నారు.