బాలయ్య బాబు అదరగొట్టేశాడంతే...!
posted on Nov 30, 2014 11:13AM
నందమూరి బాలకృష్ణ తెరపై ఉగ్రరూపం చూపిస్తుంటారు. బయట మాత్రం చాలా సరదా మనిషి. భోళా మనిషి.. చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వింటుంటాం. కానీ మేము సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డైన్ విత్ ద స్టార్స్ లో ఈ విషయం ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. హుద్ హుద్ బాధితులను ఆదుకోవడానికి తెలుగు చిత్రసీమ మేము సైతం అనే ఓ బృహత్తర కార్యక్రమం నిర్వహించింది. అంతకు ముందు శనివారం రాత్రి డైన్ విత్ ద స్టార్స్ అనే కార్యక్రమం జరిగింది. తెలుగు చిత్ర సీమలో అగ్ర తారలుగా కొనసాగుతున్నవాళ్లంతా దాదాపుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, ప్రభాస్, గోపీచంద్, మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, నాగచైతన్య, రవితేజ.. ఇలా స్టార్స్ అంతా కనిపించారు. ఎంతమంది వచ్చినా ఈ కార్యక్రమానికి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ మాత్రం నందమూరి బాలకృష్ణనే.
ఆయన ఈ వేదికపై డాన్స్ చేశారు.. లెజెండ్ సినిమాలోకి నీకంటి చూపులోన అనే పాటని పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అతిథులకు దగ్గరుండి విందు వడ్డించారు. అంతేకాదు.. సహ నటీనటులకు స్నాక్స్ తినిపించారు కూడా. బాలయ్య అందరితోనూ కలసిపోయి, కలివిడిగా తిరిగేయడం అక్కడివాళ్లందరినీ ఆశ్చర్యపరిచింది. బాలయ్య డాన్స్ చేస్తుంటే.. రవితేజ, అలీ, వెంకటేష్, విష్ణు వీళ్లంతా విజిల్స్ వేసి ఉత్సాహపరిచారు. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని బాలయ్య ఒక్కడే ముందుండి నడించాడు.. గ్రాండ్ సక్సెస్ చేశాడు.