రోశయ్యను గవర్నర్ పదవి వరించనుందా?
posted on May 30, 2011 5:33PM
హైదరా
బాద్: మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన రేపు మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఇతర అధిష్టానం పెద్దలను కూడా ఆయన కలుస్తారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించిన రోశయ్యకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చ కోసం రోశయ్యను సోనియా ఢిల్లీకి అహ్వానించినట్లు చెబుతున్నారు. రోశయ్యను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నాయి. రోశయ్య ఇటీవల కాంగ్రెసు పరిస్థితిపై కాస్త ఘాటుగానే మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియాకు ఆయన ఇటీవల ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై పార్టీ అధిష్టానం పెద్దలు రోశయ్యతో మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని అమీర్‌పేట భూకుంభకోణం రోశయ్య గవర్నర్‌గిరీకి ఆటంకాలు ఏర్పడతాయా అనేది అనుమానంగా ఉంది. ఈ కేసును పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కేసుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎసిబి కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎసిబి కోర్టు రోశయ్య పేరును క్లియర్ చేయడానికి మరో వారం రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయనను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నాయి.