సుప్రీంకు చిరంజీవి అల్లుడు
posted on May 31, 2011 9:04AM
హైదరా
బాద్: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ తన ముందస్తు బెయిలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వరకట్న కేసు వేధింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం శిరీష్ భరద్వాజ్‌కు ముందస్తు బెయిలు నిరాకరించడంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ముందస్తు బెయిలుకు ఎందుకు నిరాకరించిందో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా కుటుంబం అనుమతి లేకుండా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకున్నది. అయితే ఇటీవల శ్రీజను శిరీష్ అతని తల్లిదండ్రులు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో శ్రీజ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. తనను శ్రీజతో ఓసారి మాట్లాడించాలని, శ్రీజను బ్రెయిన్ వాష్ చేసి తన వద్ద నుండి దూరం చేశారని శిరీష్ చెప్పుకొచ్చాడు. అయితే అందుకు అవకాశం లేక పోవడంతో తనను అరెస్టు చేసే అవకాశమున్నందున శిరీష్ ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నాడు. దానిని హైకోర్టు తిరస్కరించడంతో భరద్వాజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.