రేవంత్‌రెడ్డి సారీ.. కేటీఆర్ ల‌య‌ర్‌.. ట్విట్ట‌ర్‌లో ర‌చ్చ రంభోలా..

ట్విట్ట‌ర్ హోరెత్తుతోంది. ట్వీట్లు, రీట్వీట్ల‌తో ద‌డ‌ద‌డ‌లాడుతోంది. కాంగ్రెస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌. రేవంత్‌రెడ్డి వ‌ర్సెస్ శ‌శిథ‌రూర్‌. మ‌ధ్య‌లో మంత్రి కేటీఆర్ వేలుపెట్టారు. ర‌చ్చ‌ను మ‌రింత ర‌చ్చ ర‌చ్చ చేశారు. రేవంత్‌ను ఇరుకున‌పెట్టేందుకు కేటీఆర్ మాగ్జిమ‌మ్ ట్రై చేశారు. కానీ, రేవంత్ అంత‌లోనే త‌గ్గాల్సినంత త‌గ్గి నెగ్గారు. చివ‌రాఖ‌రికి రేవంత్‌-శ‌శిథ‌రూర్ కాంప్ర‌మైజ్ అయ్యారు. ఇక‌ కేటీఆర్ ప‌ని ప‌డుతున్నారు రేవంత్‌రెడ్డి. కాస్త క‌న్ఫ్యూజ‌న్ ఉన్నా.. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందా ట్విట్ట‌ర్ వార్‌. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...

పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం ఛైర్మన్ హోదాలో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ‌ ప్రభుత్వాన్ని అభినందించారు. దానిపై రేవంత్‌రెడ్డి.. శ‌శిథరూర్‌ను అడ్డ‌గాడిద అంటూ విమర్శించారు. ఓ మీడియా ప్ర‌తినిధితో చిట్ చాట్‌గా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఇలా గాడిద అంటూ మాట్లాడారు. ఆ ఆడియో వైర‌ల్ కావ‌డంతో.. అది కాస్తా శ‌శిథ‌రూర్ వ‌ర‌కూ చేరింది. దీంతో.. శ‌శిథ‌రూర్ నుంచి కూడా కౌంట‌ర్ ప‌డింది. రేవంత్ మూలాలు అక్క‌డే ఉన్నాయి కాబ‌ట్టి అలా అన్నారంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో చివరకు రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు ట్విటర్ వేదికగా క్షమాపణ చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన థరూర్.. ఈ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు. ‘మనం అంతా కలిసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని రీట్వీట్ చేశారు.

రేవంత్‌రెడ్డి, శ‌శిథ‌రూర్ ఎపిసోడ్‌లో మ‌ధ్య‌లో కేటీఆర్ ఎంట్రీ అయ్యారు. రేవంత్ ఆడియోను పోస్ట్ చేస్తూ.. సహచర ఎంపీ రేవంత్​ రెడ్డి.. శశిథరూర్‌పై అవమానకరంగా ఇలా కామెంట్స్ చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. నేర చరిత్ర, స్వభావం ఉన్న వారు పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందన్నారు. థరూర్​పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ట్విటర్‌లో ఉంచుతూ.. దీన్ని ఫోరెన్సిక్ విభానికి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ గొంతుతో కచ్చితంగా సరిపోతుందంటూ మ‌రింత మంట రాజేశారు కేటీఆర్‌. త‌న ట్వీట్‌ను రాహుల్‌గాంధీకి సైతం ట్యాగ్ చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ల‌య‌ర్‌, లూట‌ర్ కేటీఆర్ ఇలా ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి పట్టించ‌డానికే కేటీఆర్‌ ఇలా చేస్తున్నార‌ని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

అయితే శుక్రవారం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ సభకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఇలా జరగడం కాంగ్రెస్ శ్రేణులను కొంత నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. 

ట్విట్ట‌ర్‌లో జ‌రిగిన ట్వీట్స్ వార్ ఇలా కొన‌సాగింది....