హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలయ్య భార్య నామినేషన్!

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ముంగిట నిలిచిన బాలకృష్ణకు పోటీగా, అదే పార్టీ నుంచి నందమూరి వసుంధర నామినేషన్ దాఖలు చేయడం ఏమిటి అనుకుంటున్నారా?  ఉండండి అక్కడికే వస్తున్నాం. ఆమె తెలుగుదేశం డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా డమ్మి అభ్యర్థుల చేత నామినేషన్ దాఖలు చేయించడం సహజమే. సాధారణంగా ఆ డమ్మి అభ్యర్థులు ఆయా అభ్యర్థుల కుటుంబీకులే అయి ఉంటారు. ఏదైనా సాంకేతిక కారణాల చేత నిమినేషన్ తిరస్కరణకు గురైతే బ్యాక్ అప్ గా ఉండేందుకు ఇలా డమ్మి క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేస్తారు. అయితే బాలకృష్ణ ఇలా బ్యాక్ అప్ కోసం నామినేషన్ దాఖలు చేయించడం ఇదే తొలి సారి.

ఈ సారి ఏపీలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగానూ రిస్క్ తీసుకోరాదన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ డమ్మి అభ్యర్థిగా తన భార్య వసుంధర చేత నామినేషన్ వేయించారని అంటున్నారు. హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఎన్నిక జరిగిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వస్తోంది. జగన్ వేవ్ కొనసాగిన 2019 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ విజయం సాధించారు. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలలో ఆయనకు 2014 ఎన్నికలలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది.