కొత్త వారితో కమల దళం కొత్త ప్రయోగం.. వ‌ర్క‌వుట్ అయ్యేనా?

గుజరాత్’లో కొత్త మంత్రి వర్గం కొలువు తీరింది. వరసగా ఒక్కొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులను మార్చుకుంతూ వస్తున్న బీజేపీ అధిష్ఠానం, ప్రధాని స్వరాష్ట్రం గురరాత్, మరో కొత్త ప్రయోగం చేసింది. గత వారంలో  హఠాత్తుగా  విజయ రూపానీకి ఉద్వాసన పలికి ఆయన స్థానంలో నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ పీఠం ఎక్కించిన బీజేపీ అధిష్ఠానం ఇప్పడు పాత ముఖాలు అన్నిటినీ ఒకేసారి తోలిగించింది.  అంతా కొత్తవారితో నూతన మత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. 

కొత్త మంత్రులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 24 మంది శాసనసభ్యులతో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణం చేయించారు. వీరిలో 10 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.14మంది సహాయ/స్వతంత్ర మంత్రులు ఉన్నారు. అయితే, గతంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా మంత్రులు అందరికీ ఒకే సారి ఉద్వాసన పలకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయామ్సమైంది. 

గుజరాత్‌లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, ఇలా ఒకేసారి అందరినీ ఇంటికి పంపిచడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం వల్లనే బీజేపీ పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు తగ్గ్గట్టుగానే ప్రమాణస్వీకారం చేసిన వారిలో 21 మంది తొలిసారిగా మంత్రులు కావడం విశేషం. 

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్‌ కూడా తొలిసారి ఎమ్మెల్యేనే. ఒక్క రాజేంద్ర త్రివేది, రాఘవ్‌జీ పటేల్‌, కిరీట్‌సిన్హ్‌ రాణాకు గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం ఉంది.
విజయ్‌ రూపాణీ రాజీనామాతో గుజరాత్‌ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పరిణామాలు అనేక ఊహాగానాలకు తెరలేపాయి. పటేల్‌ వర్గీయుల మద్దతు కోసమే బీజేపీ  అధిష్ఠానం  ముఖ్యమంత్రిని మార్చిందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌(పాటిదార్‌ వర్గీయుడు)కు రాష్ట్ర పగ్గాలు అప్పగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మరోవైపు కొత్త మంత్రివర్గంలోనూ పటేల్‌ వర్గీయులకు అధిక ప్రాధాన్యం కల్పించడం గమనార్హం. నూతన మంత్రివర్గంలో ఆరుగురు పటేల్‌ వర్గీయులకు చోటు కల్పించారు. అయితే, ఈ కొత్తప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడవలసి ఉంది.