కేసుకు కీలకమైన వారం.. సద్దుమణుగుతుందా? సంచలనాలా?

ఓటుకు నోటు కేసు... తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి ఎప్పడైతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుండి రాజకీయ వర్గాల్లో వేడి వాతావరణం నెలకొంది. అయితే ఈ కేసు విషయంలో ముందున్న జోరు ఇప్పుడు లేదని మాత్రం తెలుస్తోంది. అటు తెలంగాణ ప్రభుత్వం కానీ.. ఇటు ఆంధ్రా ప్రభుత్వం కాని ఈ కేసు విషయంలో కొంచెం వెనక్కి తగ్గాయా అని అనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు ఒకరినొకరు తిట్టుకున్న సీఎంలు, మంత్రులు ఇప్పుడు పెద్దగా ఎక్కడ ఆ ఊసే ఎత్తడంలేదు.. అదీకాక స్టీఫెన్ సన్ వాంగ్మూలం తరువాత ఈ కేసు ఎలాంటి కీలకమైన మలుపు తిరుగుతుందో అని చూశారు కానీ స్టీఫెన్ సన్ వాంగ్మూలం చెప్పినా కూడా అలాంటి పరిణామాలేమి జరగలేదు. ఈ విషయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు కూడా తమ దూకుడికి కొంచెం బ్రేక్ వేసినట్టే తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రా ప్రభుత్వం టీ న్యూస్ ఛానల్ కి, సాక్షి ఛానల్ కి నోటీసులు జారీ చేసి దానిని సమాధానం చెప్పాలని గడువు ఇచ్చింది.. కానీ ఆ గడువు ముగిసినా కానీ ఏపీ పోలీసు అధికారులు కూడా ఆ ఊసేత్తడం లేదు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా కొంచెం నెమ్మదించినట్టుగానే కనిపిస్తోంది.

 

అయితే ఈ కేసు ఇప్పుడు కొంచెం సద్దుమణగడానికి కేంద్ర ప్రభుత్వం చొరవేనా అని అంటే నిజమనే అంటున్నాయి రాజకీయవర్గాలు. అయితే గంతంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కేంద్రంతో భేటీ అయిన తరువాతే ఏసీబీ తమ దూకుడిని తగ్గించినట్టు అర్ధమవుతోంది. ఆ తరువాతే ఏపీ ప్రభుత్వం కూడా ముందు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధించిన ఇప్పుడు కొంత వరకూ తగ్గాయనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కేంద్ర హోంశాఖ అధికారులతో భేటీ అయిన తరువాత రోజే ఢిల్లీ వెళ్లారు. దీంతో ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

ఇదిలా ఉండగా ఈకేసులో ఈ వారం చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైలులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ ల కస్డడీ ఈ రోజుతో ముగిసింది. వీరిని ఏసీబీ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి ఏసీబీ అధికారులు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా?రాదా?అని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే వ్యవహారంలో సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య(టీడీపీ) ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాల్సిన గడువు సోమవారంతో ముగుస్తున్నది. ఈ విషయంలో ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా ఉంది. ఇంకోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసిన పిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజే విచారణ జరపనుంది. మొత్తానికి ఈ వారం ఈ కేసుకు చాలా కీలకమైందిగా కనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.. లేక నెమ్మదిగా సద్దుమణిగిపోతుందా మొదలైన విషయాలు ఈ వారంలో తెలుస్తాయి. లేకపోతే రెండు ప్రభుత్వాలు ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టే అని అర్ధంచేసుకోవచ్చని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.