స్కూల్స్‌ తెరుస్తారా? మేమే తెరుచుకోవాలా? సీఎం కేసీఆర్‌కు ట్రెస్మా స‌వాల్‌..

ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు కొవిడ్ కంట్రోల్‌లోనే ఉందంటున్నారు. నైట్ క‌ర్ఫ్యూ లాంటివేమీ అవ‌స‌రం లేదంటున్నారు. క్ల‌బ్‌లు, ప‌బ్‌లు, బార్లు, వైన్స్‌, మాల్స్‌, హోట‌ల్స్‌.. అన్నీ ఎప్ప‌టిలానే న‌డుస్తున్నాయి. కానీ, ఒక్క స్కూల్స్‌కు మాత్ర‌మే సెల‌వులు ప్ర‌క‌టించింది కేసీఆర్ స‌ర్కార్‌. అందుకు ప్ర‌భుత్వం చెప్పిన కార‌ణం.. క‌రోనా కేసులు పెరుగుతుండ‌ట‌మేన‌ని. అటెట్టా.. స్కూల్స్‌కు మీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు సెల‌వులు ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తోంది తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేష‌న్‌-ట్రెస్మా.

రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ట్రెస్మా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే స్కూళ్లు తెరవాలని డిమాండ్ చేసింది. "మీరు తెరిపిస్తారా.. మమ్మల్ని ఓపెన్ చేయమంటారా" అని నిల‌దీశారు. ప్ర‌భుత్వం రీఓపెన్ చేయ‌క‌పోతే.. జ‌న‌వ‌రి 31 తర్వాత పేరెంట్స్ ఒప్పందంతో తామే బడులు తెరుస్తామని స్పష్టం చేసింది ట్రెస్మా. 

కరోనా అదుపులోనే ఉంది అని ప్రభుత్వంమే చెబుతోందని.. అలాండప్పుడు ఎందుకు స్కూళ్లు బంద్ పెట్టారని ప్రశ్నిస్తోంది. తెలంగాణ కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యే రాష్ట్రాల్లో బడులు నడుస్తున్నాయన్నారు. విద్యార్థులపై సెలవుల ప్రభావం పడుతుందని చెప్పారు. తల్లిదండ్రుల నుంచి కూడా బడులు తెరవాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. 

పరీక్షల కాలం మొదలు కాబోతోందని.. కనీసం 50 శాతం విద్యార్థులతో నడపమని చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా నిబంధనలను కఠినతరం చేయాలిగానీ.. కొవిడ్‌ పేరు చెప్పి మొత్తం విద్యా వ్యవస్థను బంద్ చేస్తే ఎలా అని నిల‌దీసింది తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేష‌న్‌-ట్రెస్మా.