ఏపీలో ల్యాండ్ మైన్‌లా పేలిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!

ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  ప్రచారాస్త్రంగా మారింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మంగా అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివాదం అలుముకుంది. దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.  ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఇప్పటికే చేసిన సర్వేలో తమ భూమి పరిణామం తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వైసీపీ సర్కార్ కు ఘోర ప‌రాభ‌వం త‌ప్పేట‌ట్లు లేదు. భూములు జోలికి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ప్ర‌జ‌లు బుద్ధి చెబుతారు. తెలంగాణాలో అదే జ‌రిగింది. కేసీఆర్ ఓడిపోవ‌డానికి  ధరణి కూడా ఒక కార‌ణం.  ఈ చట్టం వల్ల కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. గ్రామాల్లోనూ లెక్కకు మించి  సమస్యలు వచ్చాయి. రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిన రైతులు పడిన బాధలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు.  ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణాలో ధ‌ర‌ణి లాగే, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..  ఏపీ పాలిటిక్స్‌లో ల్యాండ్ మైన్‌లా పేలింది. ప్రభుత్వం భూములు గుంజుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చిందని విపక్షాలు. లేదు మీ భూముల పరిరక్షణకే ఈ చట్టమని అధికార పక్షం ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఈ చట్టంలోని లొసుగులపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒక్కో అంశం.. ఎంత ప్రమాదకమైనదో లాయర్ల విశ్లేషణలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ భయం ఏర్పడుతోంది. ఇది వైసీపీకి పెను సవాల్ గా మారింది.  

సంక్షేమ పథకాలను అమలు పర్చినా, కేసీఆర్ ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పదేళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు, గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఒకటా.. రెండా.. చివరకు దళితబంధు కింద పది లక్ష రూపాయలను కూడా ఇస్తూ ఆ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక రైతు భరోసా కింద నిధులు ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా అందచేశారు.  అయినా ఓడిపోయారు.  ఓడిపోవ‌డానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి ధరణి పోర్టల్ అని చెప్ప‌వ‌చ్చు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను గుంజుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమేనని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు పడిపోయారు. కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ ప్ర‌ధాన కారణమని చెప్పుకోవ‌చ్చు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు అలాంటి అంశాన్నే భుజానకెత్తుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది.   ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

పట్టాదారు పాస్ పుస్తకాలపై... ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలు శాశ్వతమని, ముఖ్యమంత్రులు కారని, అలాంటిది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను ఎలా ముద్రిస్తారంటూ టీడీపీ నేతలు పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీకి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.  బడా పారిశ్రామికవేత్తలకు భూ సేకరణలో వివాదాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌