పీఎం మోదీపై డ్రోన్ దాడి!.. ఉగ్ర‌ముప్పుపై వార్నింగ్‌.. రిప‌బ్లిక్ డే వేడుక‌లే టార్గెట్‌..

ప్ర‌ధాని మోదీ ఎప్ప‌టినుంచో టెర్ర‌రిస్టుల టార్గెట్‌లో ఉన్నారు. ఫుల్ టైట్ సెక్యూరిటీతో ఉండే భార‌త ప్ర‌ధానిని ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేరు. ఆ విష‌యం తెలిసే.. అదును కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఉగ్ర‌వాదులు. ఇటీవ‌ల డ్రోన్ టెక్నాల‌జీ బాగా డెవ‌ల‌ప్ కావ‌డంతో.. మ‌రోసారి మోదీ టార్గెట్‌గా బాగా యాక్టివ్ అయ్యారు ముష్క‌ర మూక‌లు. జ‌న‌వ‌రి 26న జ‌రిగే రిప‌బ్లిక్ డే వేడుక‌లకు హాజ‌ర‌య్యే ప్ర‌ధాని మోదీని.. ఇత‌ర దేశాల ప్ర‌ముఖుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని.. డ్రోన్ దాడుల‌కు తెగ‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు హెచ్చరించడం క‌ల‌క‌లం రేపుతోంది. 

ప్రధానితో పాటు ఇతర వీవీఐపీల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రదాడుల కుట్ర గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 9 పేజీల హెచ్చరికను జారీ చేసింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐదు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది. వారికి పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు వచ్చిందని ఇంటెలిజెన్స్ నోట్ తెలిపింది. 

ఉగ్రవాదులు ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బహిరంగ సభల్లో విధ్వంసం కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్ల‌డించింది. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులు ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్నాయని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. 

పాకిస్థాన్‌లోని ఖలిస్తానీ టెర్రర్ గ్రూపులు ప్రధానమంత్రి సమావేశ వేదికలపై దాడికి ప్లాన్ చేస్తున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు ఎర్రకోట ద‌గ్గ‌ర‌ భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ముమ్మర తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.  

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటు ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని తెలుస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్‌, ఇతర నగరాల్లోనూ ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ముఠాలు తమ బృందాలను పంజాబ్‌కు సమీపంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని సభపై ఈ ఉగ్రముఠా దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 

మరోవైపు ఈ ఏడాది కూడా గణతంత్ర వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌ కన్పిస్తోంది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వేడుకలను నిరాడంబరంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి గణతంత్ర వేడుకలకు పరేడ్‌కు కేవలం 4వేల మంది వీక్షకులను మాత్రమే అనుమతించే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 

Related Segment News