ఫోటో వివాదంలో.. రేణుకకు కూతురు సపోర్ట్..!
posted on Jun 7, 2016 4:56PM
కుటుంబసభ్యులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఫోటోపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. ఈ వివాదంలో రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు ఆమె కుమార్తె తేజశ్విని. వాస్తవాలు తెలుసుకోకుండా తన తల్లిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫోటోలో పనమ్మాయిని పక్కనబెట్టి మిగిలిన వారంతా భోజనం చేస్తున్నట్టుగా ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. మానవత్వం లేకుండా పనమ్మాయిని పక్కనబెట్టి భోజనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన తేజశ్విని..ఆ పనమ్మాయిని అమ్మ నాకోసమే నియమించింది. ఆమె బాలిక కాదు, ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు 9, 7 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. రెస్టారెంట్‌లో మాతో పాటే కలిసి భోజనం చేసింది. మా అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది. తన చుట్టూ ఉన్నవారి అవసరాలను స్వయంగా తెలుసుకుని తీరుస్తుంది. ఎంతో మంది మహిళలు, పిల్లలకు సాయం చేసింది. ఇప్పటికీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోంది. అమ్మ సహాయం పొందిన వారిలో చాలా మందికి ట్విట్టర్ ఖాతాలో లేవు. అందుకే సోషల్ మీడియాలో విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం. అసలేం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధపెట్టే కామెంట్స్ చేయవద్దని తేజశ్విని పేర్కొన్నారు.