రిలయన్స్ ను బయటకులాగిన అంబటి

హైదరాబాద్: రిలయన్స్ కంపెనీ జాతి సంపదను దోచుకుంటుంటే అధికార పక్షం నోరు మెదపడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. తమ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కెజి బేసిన్ గ్యాస్ దోపిడీ 2జి స్పెక్ట్రమ్ని మించిందన్నారు. రిలయన్స్పై కంట్రోల్ అండ్ ఆడిటర్ జర్నల్ (కాగ్) నివేదిక సత్యాన్ని కాగ్ చెప్పినదానిపై సిబిఐ విచారణకు ఆదేశిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రిలయన్స్ దోచుకుంటున్న విషయాన్నే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లేవనెత్తారని గుర్తు చేశారు. దివంగత రాజశేఖర రెడ్డిని హత్య చేశారనే రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారని చెప్పారు. భూగర్భంలోని సంపదను వెలికి తీసేటప్పుడు మొత్తం భూమిలో 25 శాతం భూమిని కేంద్ర ప్రభుత్వానికి వదిలివేయాలి. ఆ ప్రకారం కెజి బేసిన్లో కూడా భూమిని వదిలివేయాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆ 25 శాతం ప్రాంతంలోని నిక్షేపాలను కూడా రిలయన్స్ కంపెనీ వెలికి తీసి అమ్ముకుంటోందని వివరించారు. ఒక చోట లైసెన్స్ తీసుకొని మరొకచోట తవ్వకాలు చేస్తున్నారని, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) యజమాని గాలి జనార్ధన రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఏ పనైతే చేశారని ఆరోపిస్తున్నారో, అదే పనిని రిలయన్స్ చేస్తోందని తెలిపారు. అలా అని తాను గాలి జనార్ధన రెడ్డిని సమర్థించడంలేదని అంబటి చెప్పారు. కక్షసాధింపులో భాగంగానే వైఎస్ జగన్మోహన రెడ్డిపై దాడులు చేస్తున్నారన్నారు. అంతకంటే ఎక్కువ ఆరోపణలు ఉన్నవారిని పట్టించుకోవడంలేదని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu