జగన్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెసు గూటికి రావాలి
posted on Sep 9, 2011 3:59PM
హైదరా
బాద్: అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి దారిలోనే మరికొంతమంది వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు కాంగ్రెసులోకి వస్తారని కమలాపురం శాసనసభ్యుడు వీర శివా రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. జగన్ తిరిగి వస్తామన్నా తాము పార్టీలో చేర్చుకోమన్నారు. జగన్ తనను నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతున్నాడని విమర్శించారు. జగన్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెసు గూటికి రావాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జైల్లో ఉన్న ఫ్యాక్షనిస్టు గౌరు వెంకట్ రెడ్డిని కలిశారని కానీ జగన్ మాత్రం కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు కాగానే ఆయన ఎవరో తనకు తెలియదంటున్నారన్నారు. వైయస్ విశ్వసనీయతను జగన్ తుడిచి వేశారన్నారు. జగన్ వర్గం 26 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వారి మనసంతా కాంగ్రెసు వైపే ఉందన్నారు. జగన్ ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఢిల్లీ టూర్ కారణంగా జగన్ వ్యక్తిత్వం దెబ్బతిన్నదన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్ ఇప్పుడు పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారన్నారు. బ్రాహ్మిణి భూములు మరో పారిశ్రామికవేత్తకు అప్పగించాలని వీరశివా సూచించారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ దేశాన్ని దోచుకునే పనిలో పడ్డారన్నారు.