పొంచి ఉన్న ఉగ్రవాదం చిదంబరం
posted on Sep 9, 2011 4:23PM
న్యూఢి
ల్లీ: ఉగ్రవాద దాడులు ఫలానా రోజు జరుగుతాయని ఎవరైనా ముందుగానే చెప్పగలరా అని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. నిఘా వైఫల్యంతోనే ఢిల్లీ తరహా పేలుళ్లు జరిగాయని ప్రతిపక్షాల ఆరోపణలను పీసీ ఖండించారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పీసీ శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముందుగా ఉగ్రవాదుల దాడుల సమాచారం ఎవరికైనా తెలిస్తే వారి సలహాలు తీసుకుంటామని చిదంబరం చెప్పారు. ఉగ్రవాద దాడులపై ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశామన్నారు. ఇంటలిజెన్స్‌ను ఆయా రాష్ట్రాలకు అందజేస్తున్నామని, ఉగ్రవాదుల సమాచారాన్ని అప్పటికప్పుడు నిఘా వర్గాలు సేకరిస్తుంటాయని పీసీ తెలిపారు. ఢిల్లీ హైకోర్టు వెలుపల జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 13 మంది మరణించగా, 88 మంది గాయపడ్డారని మంత్రి ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. ఢిల్లీ హైకోర్టులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎప్పుడో కోరామని పీసీ ఈ సందర్భంగా తెలియజేశారు. నిఘా వైపల్యం జరగలేదని, ఇంటలిజెన్స్ సమాచారాన్ని రహస్యంగా ఉంచడం లేదని కేంద్ర హోం మంత్రి తెలియజేశారు. పొరుగు దేశాల నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి వుందన్న పీసీ, నగర ప్రాంతాల్లోనూ ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుచేత ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానస్పద వస్తువులు, వ్యక్తులు గానీ తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పీసీ సూచించారు. భద్రత విషయాలపై అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తున్నామని చిదంబరం చెప్పారు. రక్షణ విషయంలో అవసరమైతే విదేశీ ఏజన్సీలతో కూడా కలిసి పనిచేస్తామని మంత్రి చెప్పారు.